AP Municipal Election Results

AP Municipal Election Results: కూటమి ప్రభంజనం.. 8 కార్పొరేషన్లు, 47 మున్సిపాలిటీల్లో లీడ్.. తాజా వార్డుల ఫలితాలు ఇవే!

AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్డీయే కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది. మొత్తం 13 నగరపాలక సంస్థలకు గాను 8 చోట్ల కూటమి అభ్యర్థులు (టీడీపీ 7, జనసేన 1) లీడ్‌లో కొనసాగుతున్నారు. అలాగే 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో టీడీపీ 39, జనసేన 7, బీజేపీ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,020 వార్డుల్లో ఫలితాలు, ట్రెండ్స్ పరిశీలిస్తే టీడీపీ ఏకంగా 600 వార్డుల్లో, జనసేన 26, వైఎస్సార్‌సీపీ 21, బీజేపీ 13 వార్డుల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి.

కూటమి కైవసమైన కీలక మున్సిపాలిటీలు..

కృష్ణా జిల్లా – పెడన మున్సిపాలిటీ క్లీన్‌స్వీప్: పెడన మున్సిపాలిటీని కూటమి భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. మొత్తం వార్డుల్లో టీడీపీ 19 చోట్ల, జనసేన 6 చోట్ల ఘనవిజయం సాధించాయి.

గుంటూరు జిల్లా – వినుకొండ మున్సిపాలిటీ కూటమి వశం:వినుకొండ మున్సిపల్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థులు 14 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ 2, జనసేన 1, వైఎస్సార్‌సీపీ 1 వార్డులో గెలుపొందాయి.

శ్రీ సత్యసాయి జిల్లా – పెనుకొండలో సంపూర్ణ విజయం: మొత్తం 23 వార్డులకు గాను కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ఇందులో టీడీపీ 21 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా, బీజేపీ, జనసేన చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి.

కృష్ణా జిల్లా – కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ క్లీన్‌స్వీప్: కుప్పం మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. మొత్తం వార్డులను టీడీపీ ఏకపక్షంగా తన ఖాతాలో వేసుకుంది (12 వార్డుల్లో కౌన్సిలర్ల గెలుపు, 13 వార్డులు ఇప్పటికే టీడీపీ వశం).

నెల్లూరు జిల్లా – వెంకటగిరి మున్సిపాలిటీ కూటమి సొంతం: మొత్తం 36 వార్డుల లెక్కింపు పూర్తి కాగా టీడీపీ 29, బీజేపీ 2, జనసేన 1 వార్డును గెలుచుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ 4 వార్డులకే పరిమితమైంది.

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ!

తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జిల్లాలోని మొత్తం 96 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 3 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది.

మండపేట: మొత్తం 36 వార్డులనూ కూటమి కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది.

కొవ్వూరు: 28 వార్డులకు గాను 27 వార్డులు కూటమి ఖాతాలోకి వెళ్లగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

నిడదవోలు: 36 వార్డుల్లో జనసేన 14, టీడీపీ 13, బీజేపీ 1 చోట గెలవగా.. వైఎస్సార్‌సీపీ 3 వార్డుల్లో నెగ్గింది. మరో వార్డుకు రీకౌంటింగ్ కొనసాగుతోంది.

మున్సిపాలిటీల వారీగా తుది & తాజా ఫలితాలు:

శ్రీకాకుళం – ఇచ్ఛాపురం తుది ఫలితాలు (27 వార్డులు):

    • టీడీపీ: 15 వార్డులు (24వ వార్డు ఏకగ్రీవంతో కలిపి)

    • జనసేన: 4 వార్డులు

    • వైఎస్సార్‌సీపీ: 7 వార్డులు

    • స్వతంత్రులు: 2 వార్డులు

జగ్గయ్యపేట: 31వ వార్డులో జనసేన తరఫున పోటీ చేసిన మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన 540 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు.

తిరుపతి కార్పొరేషన్: పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌కు 305 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 91 ఓట్లు వచ్చాయి. డివిజన్లలో 7, 8, 9వ డివిజన్లలో టీడీపీ.. 34, 35, 36వ డివిజన్లలో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.

పార్వతీపురం మున్సిపాలిటీ: 5 వార్డుల్లో టీడీపీ, 1 వార్డులో జనసేన విజయం సాధించాయి.

సాలూరు: 1, 29 వార్డుల్లో టీడీపీ.. 5, 25 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందాయి. 25వ వార్డులో కేవలం ఒక్క ఓటు తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హైమ విజయలక్ష్మి విజయం సాధించారు.

నరసాపురం (18 వార్డుల ఫలితాలు): టీడీపీ 10, జనసేన 5, బీజేపీ 1, వైఎస్సార్‌సీపీ 2 వార్డులను కైవసం చేసుకున్నాయి.

ఆత్మకూరు (నెల్లూరు): పొత్తుల్లో టికెట్ దక్కకపోవడంతో రెబల్స్‌గా బరిలోకి దిగిన జనసేన నేతలు గడ్డం సంధ్య (12వ వార్డు), కోలగాని శిరీష (11వ వార్డు)లు టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై స్వతంత్రులుగా ఘనవిజయం సాధించారు.

రామచంద్రపురం (కోనసీమ): ఇక్కడ విచిత్రమైన తీర్పు వెలువడింది. కూటమి చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు సొంత వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలవగా.. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు సొంత వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు.

ధర్మవరం: 1వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ ఒక్క ఓటు తేడాతో గెలవడంతో బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి రీకౌంటింగ్ కోరారు. ప్రస్తుతం అక్కడ లెక్కింపు కొనసాగుతోంది.

టీడీపీ ఆధిక్యంలో ఉన్న ప్రధాన మున్సిపాలిటీలు..

నర్సీపట్నం, పెనుకొండ, వెంకటగిరి, నందిగామ, జగ్గయ్యపేట, సూళ్లూరుపేట, నాయుడుపేట, నూజివీడు, మార్కాపురం, మాచర్ల, ఎమ్మిగనూరు, జమ్మలమడుగు, డోన్, పలమనేరు, పెద్దాపురం, బొబ్బిలి, ఏలేశ్వరం, నంద్యాల, హిందూపురం, జంగారెడ్డిగూడెం, మదనపల్లె, సత్తెనపల్లి, తాడిపత్రి, పార్వతీపురం, ఉయ్యూరు, పులివెందుల, ధర్మవరం పురపాలికల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అన్ని కేంద్రాల్లో లెక్కింపు వేగంగా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *