cm chandrababu: మామిడి రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మామిడి పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. కుప్పా నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఆయన, రైతుల నుంచి తక్షణంగా మామిడి కొనుగోలు చేయాలని సూచించారు. మామిడి ధర పడిపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన సీఎం, రైతులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని, ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. అయితే పల్ప్ పరిశ్రమలు ఆర్డర్లు లేవు, నిల్వ స్థలం లేదు అనే కారణాలతో కొనుగోలు చేయడం లేదని రైతులు వివరించారు. కొన్ని చోట్ల 3-4 రోజులు అన్‌లోడింగ్‌కి సమయం పడుతోందని విన్నవించగా, దీనిపై సీఎం తీవ్రంగా స్పందించి వెంటనే రైతుల పంటను కొనుగోలు చేయాలని పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేశారు.
పాలకులు కొందరు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వాదనలపై రైతులు నమ్మకం ఉంచకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. మామిడి పంటకు దీర్ఘకాలిక రక్షణ కల్పించేలా స్థిరమైన కార్యాచరణను చేపడతామని హామీ ఇచ్చారు.
పల్ప్ పరిశ్రమలు, ఎగుమతిదారులు యూరోప్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువ, పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల్లో సుంకాలు లేవు అని వివరించారు. విదేశీ మార్కెట్లలో పోటీ పడేందుకు కేంద్రం ద్వారా ఆ దేశాలతో చర్చించాలని కోరారు. అలాగే మామిడి పల్ప్‌పై జీఎస్టీని 12% నుండి 5% కు తగ్గించాలని కోరగా, దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు, మరోసారి చర్చిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
మధ్యాహ్న భోజన పథకంలో మూడురోజుల పాటు మ్యాంగో జ్యూస్ అందించాలన్న పరిశ్రమల ప్రతిపాదనపై కూడా సీఎం స్పందించారు. ప్రస్తుతం విద్యార్థులకు గుడ్డు పోషకాహారంగా అందుతున్నట్లు, ఈ అంశంపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రైతులు ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ నేచురల్ ఫార్మింగ్ వైపు అడుగులు వేయాలని సూచించిన సీఎం, ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా టెస్టింగ్, ట్రేసింగ్, సర్టిఫికేషన్ కీలకమని తెలిపారు. మామిడి రైతులకు రెండు రోజుల లోపే రూ. 8 కనీస ధర చెల్లించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు మద్దతుగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్రం మొత్తం నేచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తుండగా, మామిడి రైతులు కూడా జాగ్రత్తగా సాగు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు