Chandrababu Naidu: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్’ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశారు. 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న చట్ట సవరణ బిల్లును అందరూ ఏకగ్రీవంగా బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YSRCP), పవన్ కల్యాణ్ (జనసేన), పీవీఎన్ మాధవ్ (బీజేపీ), వైఎస్ షర్మిల (కాంగ్రెస్)తో పాటు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు ఆయన లేఖలు పంపారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 16, 2026 ఒక చారిత్రాత్మకమైన రోజు అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల ఇప్పుడు నిజం కాబోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు కేటాయించడం వల్ల సమానత్వం సాధించవచ్చని, ఇది దేశ పురోగతికి గొప్ప ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, పరిపాలనలో కూడా వారి భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్య, టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో మహిళలు అద్భుతాలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. గతంలో 2023లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు పలికారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా అందరూ కలిసి రావాలని కోరారు.
మహిళా రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయం మాత్రమే కాదని, ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2029 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమలు కావాలన్న ప్రధాని సంకల్పాన్ని ప్రతి ఎంపీ, ప్రతి పార్టీ బలపరచాలని ఆయన కోరారు. మన ఇంటి ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చే ఈ పవిత్ర ఘట్టంలో అందరూ భాగస్వాములు కావాలని, భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదామని చంద్రబాబు తన లేఖలో పిలుపునిచ్చారు.
