Chandrababu

Chandrababu: ఒక భక్తుడు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారం ఇవ్వడం ఒక చరిత్ర..

Chandrababu: తిరుమల లాంటి పవిత్ర దివ్యక్షేత్రంలో నేడు ఒక అపూర్వమైన, చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. గురువారం (నవంబర్ 26, 2026) ఉదయం సతీమణి నారా భువనేశ్వరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ రంగనాయకుల మండపంలో చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు సమర్పించిన రూ.206 కోట్ల విలువైన 121 కిలోల స్వర్ణాభరణాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టీటీడీ అధికారులకు అందజేశారు. అనంతరం దాత దంపతులతో కలిసి తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ పలు కీలక విషయాలు వెల్లడించారు.

తిరుమల శ్రీవారి వైభవం మాటల్లో చెప్పలేనిదని, తిరుమల అంటేనే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందానికి నిలయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలో మరెక్కడా దొరకని గొప్ప దివ్యానుభూతి ఒక్క తిరుమలలోనే లభిస్తుందని అన్నారు. ఒక భక్తుడు ఏకంగా రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించడం టీటీడీ చరిత్రలోనే ఒక మైలురాయి అని, ఈ మహత్తర ఘట్టంలో తాను భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ 121 కిలోల బంగారంలో 106 కేజీలతో శ్రీవారికి, 15 కేజీలతో శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం, ఆభరణాలు తయారు చేయించారని సీఎం వివరించారు. పాద కవచాలు, కౌస్తుభం, నాగాభరణాలు, వజ్రాలు, రత్నాలతో ఆభరణాలను అత్యంత బ్రహ్మాండంగా డిజైన్ చేశారని ప్రశంసించారు. తరాలు మారినా కలియుగ దైవంపై భక్తులకు ఉన్న విశ్వాసం చెక్కుచెదరకుండా కొనసాగుతోందనడానికి వర్ధమాన్ జైన్ దంపతుల విరాళమే నిదర్శనమని, టీటీడీ ఖాతాలు అత్యంత పారదర్శకంగా ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇదే సందర్భంగా తిరుమల అభివృద్ధి మరియు దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. దేశంలో మరెక్కడా లేని అద్భుతమైన పచ్చదనం తిరుమలలో ఉంటుందని, తిరుమలను మరింత దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతేకాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మిస్తామని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టామని, దేవాలయం నిర్మించిన ప్రతిచోటా భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *