Crime News

Crime News: ఆదిలాబాద్ జిల్లాలో దారుణ పరువు హత్య..!

Crime News: ఆదిలాబాద్ జిల్లాలో అమానుషమైన పరువు హత్య వెలుగుచూసింది! మేనత్త కొడుకును ప్రేమించిందన్న కోపంతో, సమాజంలో పరువు పోతుందనే భావనతో కన్నకూతురినే అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హతమార్చాడు ఓ కసాయి తండ్రి. అంతేకాకుండా ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఉరివేసి నాటకమాడాడు. అయితే, సంప్రదాయానికి విరుద్ధంగా హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కుట్ర బట్టబయలైంది.

పోలీసులు మరియు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్, సుమిత్ర దంపతులకు కళ్యాణి (18) అనే కుమార్తె ఉంది. తల్లిదండ్రులు ఆమెకు ఈ నెల (నవంబర్) 25వ తేదీన వేరే యువకుడితో నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు, అంటే ఈ నెల 23వ తేదీన కళ్యాణి తీవ్ర మనోవేదనతో బాధపడుతుండటాన్ని తండ్రి కైలాస్ గమనించాడు. ఏం జరిగిందని గట్టిగా నిలదీయడంతో, తాను మేనత్త కొడుకును ప్రేమిస్తున్నానని, ఈ పెళ్లి ఇష్టం లేదని కళ్యాణి తండ్రికి చెప్పింది.
కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పరువు పోతుందనే ఉద్దేశంతో కూతురిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే రాత్రి కళ్యాణి గాఢ నిద్రలో ఉండగా గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని పక్క గదిలోకి తీసుకెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసినట్లుగా వేలాడదీశాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తల్లి సుమిత్ర, ఉరికి వేలాడుతున్న కూతురిని చూసి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
అయితే, ఘటన జరిగిన తర్వాత తండ్రి కైలాస్ వ్యవహరించిన తీరు స్థానికుల్లో తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. మృతదేహాన్ని ఉంచి కేవలం మూడు గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించాడు. అంతేకాకుండా, లంబాడ సంప్రదాయం ప్రకారం పెళ్లికాని యువతి మరణిస్తే ఖననం (పూడ్చిపెట్టడం) చేయాలి. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని దహనం (కాల్చడం) చేశారు.
తండ్రి తొందరపాటు, సంప్రదాయ విరుద్ధమైన చర్యలతో అనుమానం వచ్చిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, తండ్రి కైలాస్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. పరువు పోతుందనే ఉద్దేశంతో తానే నిద్రలో ఉన్న కూతురి గొంతు నులిమి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరివేశానని కైలాస్ నేరం అంగీకరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *