Netflix India

Netflix India: పాకిస్థానీ వెబ్ సిరీస్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్.. !

Netflix India: పాకిస్థాన్‌కు చెందిన తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ (Jo Bachay Hain Sang Samait Lo) భారత విడుదలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారత్‌లో ఎలాంటి పాకిస్థానీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయవద్దని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, సనమ్ సయీద్, హనియా ఆమిర్ ప్రధాన పాత్రల్లో మోమినా దురైద్ దర్శకత్వం వహించిన ఈ పాకిస్థానీ వెబ్ సిరీస్ డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కావాల్సి ఉండగా, భారత సినీ కార్మిక సంఘాల తీవ్ర నిరసనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

అసలు ఈ వివాదం ఎందుకు చెలరేగిందంటే.. గతేడాది ఏప్రిల్ 22, 2025న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మరియు ఆ తర్వాత భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో, మే 8, 2025న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్‌లో రూపొందిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లను భారత్‌లో తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. 

అప్పట్లో నెట్‌ఫ్లిక్స్ కూడా భారత్‌లో పాకిస్థానీ కంటెంట్ ఏదీ లేదని కేంద్రానికి హామీ ఇచ్చింది. అయితే, తాజాగా ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ ట్రైలర్ విడుదల కావడం, అది నెట్‌ఫ్లిక్స్ ఇండియా కేటలాగ్‌లో డిసెంబర్ 4 విడుదల తేదీతో కనిపించడంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) మరియు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (FWICE) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

వాణిజ్య ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంటూ, ఈ సిరీస్‌ను భారత్‌లో నిషేధించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ, గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి పాక్ కంటెంట్‌ను భారత సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంచవద్దని నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది.

మరోవైపు, భారత్‌లో తమ వెబ్ సిరీస్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్లపై పాకిస్థాన్ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. భారత్ కళలు, సంస్కృతి మరియు క్రీడలను ఆయుధాలుగా మారుస్తోందని ఆరోపిస్తూ ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో పోస్ట్ చేశారు. 

“మొదట క్రీడలను, తర్వాత నీటిని, ఇప్పుడు కళ, సంస్కృతిని ఆయుధంగా మారుస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయ బెదిరింపుగా, టీవీ డ్రామాను జాతీయ భద్రతా ఆందోళనగా చూడటానికి ఎంత అభద్రతాభావం ఉండాలి? కళాకారులను సృష్టించనీయండి, ప్రేక్షకులు ఏమి చూడాలో నిర్ణయించుకోనివ్వండి” అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ సిరీస్‌కు సంబంధించి ఎలాంటి ప్రమోషన్లు చేయకపోవడం గమనార్హం; కేంద్రం ఆదేశాల నేపథ్యంలో డిసెంబర్ 4న ఈ సిరీస్ కేవలం పాకిస్థాన్ మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *