CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయిని, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే భారీ వరదలు, విపత్తులను తట్టుకునేలా అత్యంత పటిష్టమైన కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మిస్తున్నామని, దీనిని ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్లే ఇప్పుడు అదనంగా రూ. 1,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పనుల గురించి వివరిస్తూ.. మెయిన్ డ్యామ్‌లోని ఈసీఆర్ఎఫ్-1 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ఎస్సీఆర్ఎఫ్ గ్యాప్-2 పనులను వచ్చే ఏడాది (2027) మార్చి నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. కుడి కాలువ అనుసంధానంలో 19 మీటర్ల వెడల్పు, ఎత్తుతో నిర్మిస్తున్న రెండు భారీ టన్నెళ్లు ప్రాజెక్టు విశిష్టతను చాటుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 87 శాతం సివిల్ పనులు ముగిశాయని, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ (R&R) మొదటి దశ పనులను ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: KTR: ముగ్గురు మొనగాళ్లు కాదు.. ముగ్గురు మోసగాళ్లు
నీటి వినియోగంపై పొరుగు రాష్ట్రాలతో ఉన్న వివాదాలపై స్పందిస్తూ, గోదావరి జలాల విషయంలో రాజకీయం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. “సముద్రంలో వృథాగా కలిసే నీటిని ఎవరైనా వాడుకోవచ్చు, దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదు” అని ఆయన హితవు పలికారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని, గతంలో తాము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులైన దేవాదుల, కల్వకుర్తికి చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మార్చేందుకు, విశాఖపట్నానికి తాగునీరు అందించేందుకు పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
పోలవరం పర్యటన ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీకి బయలుదేరారు. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న ఆయన, ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదల, ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న న్యాయపరమైన అడ్డంకులపై చర్చించనున్నారు. మే మొదటి వారంలో తాను మళ్లీ ప్రాజెక్టును తనిఖీ చేస్తానని చెబుతూ, అప్పటికి పనుల్లో మరింత వేగం కనిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
