Chandrababu: ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ బహిరంగ సభలో పాల్గొని రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. రైతులకు చెందిన భూమి, పాస్ పుస్తకంపై రైతుల బొమ్మ మాత్రమే ఉండాలి తప్ప వేరే రాజకీయ నాయకుల ఫోటోలు వేసుకునే హక్కు ఎవరికీ లేదు అని పరోక్షంగా గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ట్యాంపర్ ప్రూఫ్ పాస్ పుస్తకాలు
భూ వివాదాల పరిష్కారం, రైతుల భూమికి రక్షణ కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సీఎం వివరించారు..
-
ట్యాంపరింగ్ లేని వ్యవస్థ: రాష్ట్రవ్యాప్తంగా 7,400 గ్రామాల్లో ఇప్పటికే 30 లక్షలకు పైగా నూతన పాస్ పుస్తకాలను అందించామని, ఎవరూ ఫోర్జరీ లేదా ట్యాంపరింగ్ చేయకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీ (Blockchain Technology) ఇంకా QR కోడ్ ఫీచర్లతో రూపొందించినట్లు తెలిపారు.
-
లాక్ అండ్ e-KYC: రైతుల అనుమతి లేకుండా భూమి వివరాలు మార్చకుండా e-KYC వ్యవస్థను తెచ్చామన్నారు. రాష్ట్రంలో మొత్తం 68 లక్షల మంది రైతులకు పూర్తిస్థాయిలో పట్టాలు అందేవరకు అధికారులను వదిలిపెట్టనని స్పష్టం చేశారు.
-
22A సమస్యల పరిష్కారం: గతంలో రాజకీయ కక్షలతో 22A నిషేధిత జాబితాలో పెట్టిన భూ సమస్యలను గ్రామసభల ద్వారా వేగంగా పరిష్కరిస్తున్నామన్నారు.
ఆక్వా రైతులకు రూ. 1.50లకే విద్యుత్ – మౌలిక వసతులపై హామీ!
గోదావరి జిల్లాల్లో రోడ్ల దుస్థితిని చక్కదిద్దే బాధ్యత తమదని సీఎం భరోసా ఇచ్చారు..
-
ఆక్వా రంగానికి ఊతం: 2019-24 మధ్య దెబ్బతిన్న ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి, అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ఆక్వా రైతులకు యూనిట్ రూ. 1.50 కే విద్యుత్ అందిస్తున్నామని గుర్తుచేశారు.
-
శాంతిభద్రతలపై హెచ్చరిక: చట్టాన్ని అతిక్రమించి రోడ్లపై అరాచకాలు సృష్టిస్తే సొంత పార్టీ వారినైనా, ప్రతిపక్షాలనైనా సహించేది లేదని తేల్చి చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
డీఎస్సీ అభ్యర్థుల పేరిట వైఎస్సార్సీపీ చేస్తున్న అనవసర రాజకీయాలకు, కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులే తమ ఆత్మగౌరవ ర్యాలీతో సమాధానం చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు.
