Chandrababu: పొదుపు సంఘాలకు.. రూ. 5,200 కోట్లతో భారీ కార్పస్ ఫండ్!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా శక్తిని భాగస్వామ్యం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. బుధవారం పొదుపు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖిలో మహిళా సాధికారతపై ఆయన సంచలన ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని కోటి 13 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తన అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన కోసం రూ. 5,200 కోట్లతో ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించి మహిళా లోకానికి శుభవార్త చెప్పారు.

అంకెల్లో మహిళా శక్తి.. ఆన్‌లైన్‌లో రుణాలు

ప్రస్తుతం రాష్ట్రంలోని పొదుపు సంఘాలు రూ. 26 వేల కోట్ల భారీ నిధిని ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. గతంలో తన మాట విని పొదుపు బాట పట్టిన కుటుంబాలు నేడు ఆర్థికంగా ఎంతో బాగుపడ్డాయని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఆన్‌లైన్‌లోనే రుణాలు తీసుకునే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. రుణాలు తీసుకున్న మహిళలు వాటిని సకాలంలో చెల్లించి, మళ్లీ రుణాలు తీసుకుంటూ తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: Rashmika Mandanna: టాక్స్ కట్టడంలో రికార్డు కొట్టిన రష్మిక

ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త

“మహిళల శక్తి నాకు తెలుసు.. మన రాష్ట్ర మహిళలు ఉత్తర భారతదేశంలోని మహిళలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు” అంటూ చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే లక్ష మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే తన కోరిక అని పేర్కొన్నారు. ఇందుకోసం మహిళలకు నెలనెలా లక్ష్యాలను (టార్గెట్స్) విధిస్తానని, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రజలందరూ ఆనందంగా ఉండేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అత్యధిక తలసరి ఆదాయం పొందేది మన తెలుగు కుటుంబాలేనని, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారు దానికి నిదర్శనమని ఆయన ఉదాహరించారు.

మార్చిలో మరో భారీ సమావేశం

మహిళల సౌకర్యార్థం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని, మహిళా సంఘాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘బెస్ట్ ప్రాక్టీసెస్’ను ఇక్కడికి తీసుకువస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు మార్చి నెలలో మరోసారి మహిళా సంఘాలతో భేటీ అవుతానని ఆయన వెల్లడించారు. మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తులుగా ఎదగాలన్న చంద్రబాబు పిలుపు ఇప్పుడు మహిళా సంఘాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *