Chandrababu

Chandrababu: ఇవాళ నా జీవితం ధన్యమైంది.. పేదలకు పట్టాభిషేకం చేశాం!

Chandrababu: పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడే ఏ నాయకుడికైనా నిజమైన సంతృప్తి లభిస్తుంది. వేల కుటుంబాలకు వారి నివాసాలపై శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు అందించిన ఈ రోజు నా జీవితం ధన్యమైంది!” — విశాఖపట్నం వేదికగా జరిగిన ‘పేదలకు పట్టాభిషేకం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగంగా చేసిన ప్రకటన ఇది. విశాఖ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసముంటున్న పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ.. 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు అధికారిక రాజముద్రతో కూడిన ఇళ్ల పట్టాలను సీఎం స్వయంగా అందజేశారు.

ఇకపై మీ ఇళ్లపై సర్వహక్కులు మీవే – బ్యాంక్ రుణాలు కూడా పొందవచ్చు..

“కూడు, గూడు, గుడ్డ అనే ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. తరతరాలుగా భయం భయంగా బతికిన పేదలకు నేడు విముక్తి లభించింది. అభ్యంతరం లేని స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన శాశ్వత పట్టాలు ఇచ్చాం. ఇకపై మీ ఆస్తులపై ఎవరి వివాదాలు ఉండవు.. ఎలాంటి భయాలు అక్కర్లేదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పట్టాల ద్వారా ఇకపై లబ్ధిదారులు తమ ఇళ్లపై బ్యాంకు రుణాలను కూడా సులభంగా పొందే చట్టబద్ధమైన హక్కును దక్కించుకున్నారని తెలిపారు.
సింహాచలం దేవస్థానానికి చెందిన పంచగ్రామాల్లో 12,149 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, అలాగే మిగిలిన 35 కాలనీల్లో మరో 10 వేల మంది పట్టాలు కోరుతున్నారని వెల్లడించారు. మిగిలి ఉన్న పేదలందరికీ సత్వరమే పట్టాలు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
విశాఖను విశ్వనగరంగా మారుస్తాం – ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు..
విశాఖపట్నం అతి త్వరలోనే ప్రపంచ స్థాయి ‘విశ్వనగరం’గా రూపుదిద్దుకోబోతోందని సీఎం పేర్కొన్నారు. ఈ రెండేళ్లలోనే విశాఖకు 91 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయని, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఒక గేమ్‌చేంజర్ కాబోతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 5.37 లక్షల కోట్ల పెట్టుబడులతో 3 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ నగర దాహార్తిని శాశ్వతంగా తీరుస్తామని, వంశధార అనుసంధానంతో ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపడతామని హామీ ఇచ్చారు. పచ్చదనం, పరిశుభ్రతలో విశాఖ తన ప్రత్యేకతను నిలుపుకోవాలని, ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ (సోలార్) ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కూటమి పాలనలో అవినీతికి తావులేదు.. గత ఐదేళ్లు రాష్ట్రానికి పీడకల

రుషులు తపస్సు చేసిన రుషికొండను తవ్వి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారు. దాని మెయింటెనెన్స్‌కే ప్రజాధనం విపరీతంగా ఖర్చవుతోంది. గత పాలకులు చేసిన రూ. 10 లక్షల కోట్ల అప్పులతో ఖజానా ఖాళీ చేసి వెళ్లారు” అని విమర్శించారు. గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా భూకబ్జాలే రాజ్యమేలాయని, చివరకు పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూను కూడా కల్తీ చేసే దుర్మార్గానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తాను ఉన్నంత వరకు రాష్ట్రంలో అవినీతిని సహించే ప్రసక్తే లేదన్నారు. మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని, డీఎస్సీ అంటేనే టీడీపీ-ఎన్డీఏ అని తేల్చిచెప్పారు. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రతనిచ్చే నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *