Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి ఆస్పత్రి, మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పేషెంట్లందరూ ఒక్కసారిగా ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చే రుకున్న ఫైర్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మరో 37 మందిని అతికష్టం మీద రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. శుక్రవారం రాత్రి 10.35 గంటల సమయంలో ఆస్పత్రిలోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో స్పాట్కు చేరుకుని మంటలను కంట్రోల్ చేసినట్లు తెలిపారు. మృతులందరూ చిన్నారులే కావడంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.ఘటనపై ఝాన్సీ కలెక్టర్ అవినాష్ కుమార్ స్పందించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తేల్చడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.