Cm chandrababu: గుంటూరు నగర శివార్లలో నిర్వహిస్తున్న ‘సరస్ ఎగ్జిబిషన్ – అఖిల భారత డ్వాక్రా బజార్’ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సందర్శించారు. డ్వాక్రా మహిళల ప్రతిభ, వారి ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా ఎగ్జిబిషన్‌కు హాజరై స్టాళ్లను పరిశీలించారు.
ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు హస్తకళా, ఆహార పదార్థాలు, గ్రామీణ పారిశ్రామిక ఉత్పత్తులను సీఎం ప్రత్యేకంగా గమనించారు. ఈ సందర్భంగా మాడుగుల ప్రాంతానికి ప్రత్యేకమైన మాడుగుల హల్వా అందించిన స్టాల్ వద్ద ఆగిన చంద్రబాబు స్వయంగా రుచి చూశారు. హల్వా రుచి చూసిన వెంటనే “టేస్ట్ చాలా బాగుంది” అని ప్రసంశలు కురిపించారు. దీంతో ఆ ఉత్పత్తిని తయారు చేసి స్టాల్ ఏర్పాటుచేసిన డ్వాక్రా మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ఇతర స్టాళ్లలో ప్రదర్శించిన హస్తకళా వస్తువులు, పండుగ ప్రత్యేక వస్తువులు, గ్రామీణ మహిళల తయారీ ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు, మహిళా స్వయంసహాయక సంఘాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి శ్రమ, ప్రతిభ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ సందర్శనలో ఆయన వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మాధవి, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, తదితర ప్రజాప్రతినిధులు మరియు అధికారుల బృందం పాల్గొన్నారు.
