Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో అద్భుతమైన సాంకేతిక విప్లవానికి వేదికైంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా అమరావతిలో క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley) భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ భారీ ప్రాజెక్టు ఏపీని ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన: టెక్నాలజీలో ఏపీ నవశకం!
ఉద్దండరాయునిపాలెంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ క్వాంటం వ్యాలీ భారతదేశానికే ‘గేమ్ ఛేంజర్’ కాబోతోంది. ఒకప్పుడు తాను హైదరాబాద్‌లో హైటెక్ సిటీని ఎలాగైతే విజన్‌తో నిర్మించారో, ఇప్పుడు అమరావతిలో క్వాంటం టెక్నాలజీ ద్వారా రాబోయే 40 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అడుగు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో దేశంలోనే అత్యంత శక్తివంతమైన IBM క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు.
యువతే నా బలం – సీఎం చంద్రబాబు
ఈ కార్యక్రమంలో సీఎం యువతపై తనకున్న అచంచలమైన నమ్మకాన్ని మరోసారి చాటిచెప్పారు. “నా ఆశలన్నీ విద్యార్థులపైనే ఉన్నాయి. కొత్త చరిత్ర రాయాలన్నా, ఉన్న చరిత్రను తిరగరాయాలన్నా అది కేవలం యువతకే సాధ్యం” అని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రస్తుతం మన తెలుగు యువత ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మందిలో 35 మంది ఉండటం గర్వకారణమని, రాబోయే రోజుల్లో క్వాంటం నిపుణులుగా కూడా వారే రాణించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ‘వైజర్’ (WISER) సంస్థ ద్వారా 2035 నాటికి 35 లక్షల మంది విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
టెక్ దిగ్గజాలతో ఒప్పందాలు
క్వాంటం మిషన్ విజయవంతం చేయడం కోసం ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐబీఎం (IBM), ఎల్ అండ్ టీ (L&T) వంటి దిగ్గజ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏప్రిల్ 14న మరో రెండు క్వాంటం సెంటర్లను కూడా ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. అమరావతి కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, క్వాంటం మెడిసిన్, సైబర్ సెక్యూరిటీ, రక్షణ రంగాలకు కేంద్రంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ టెక్ విజన్ పై ప్రశంసలు
సాంకేతికతను ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అవగాహన అమోఘమని చంద్రబాబు కొనియాడారు. “నేను ఎంతోమంది ప్రధాన మంత్రులతో పనిచేశాను, కానీ టెక్నాలజీపై ప్రధాని మోదీకి ఉన్నంత పట్టు మరెవరికీ లేదు” అని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ క్వాంటం మిషన్ కోసం రూ. 6,000 కోట్లు కేటాయించిందని, ఏపీకి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతికి రానుండటం విశేషం.
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తున్న తీరును సీఎం అభినందించారు. అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని, ఏపీ త్వరలోనే ‘క్వాంటం క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా అవతరిస్తుందని ఈ వేడుక సాక్షిగా ప్రకటించారు.
