Chandrababu: తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఆయన, జిల్లా టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు
ఈ దుర్ఘటన తన మనసును కలచివేసిందని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అపచారం జరగకూడదని తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధితులతో మాట్లాడి అన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరించి పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల విశ్వాసం వల్లే తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్న ఆయన, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా మాత్రమె నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వైకుంఠ ద్వార దర్శనాలను రెండు రోజులకే పరిమితం చేయాలని సూచించారు.
బాధితుల కోసం చర్యలు
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం.
మృతుల కుటుంబాలకు కాంట్రాక్టు ఉద్యోగాలు.
తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం.
సాధారణ గాయాలపాలైన వారికి రూ. 2 లక్షల పరిహారం.
గాయపడ్డ 31 మంది భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడం.
పరిపాలన విభాగంపై చర్యలు
ఘటనకు కారణమైన నిర్వాకం పట్ల కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు. రమణ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోశాల డైరెక్టర్ హరినాధ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎప్సీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమీ, సీవీఎస్వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేశారు.