Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ఎగురడం కలకలం రేపింది. పవిత్రమైన ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించడం భద్రతా దృష్ట్యా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతోంది.
ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు, డ్రోన్ ఎగురేసిన వ్యక్తిని గుర్తించారు. అతడు రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్ అన్షుమన్‌గా అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయ పరిసరాల్లో అనుమతిలేకుండా వీడియోలు తీసేందుకు అన్షుమన్ డ్రోన్‌ను వినియోగించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో అతనిపై కేసు నమోదు చేసి, డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల వంటి అత్యంత భక్తి ప్రదేశాల్లో ఇలాంటి చర్యలు భద్రతకు ముప్పుగా మారతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.