Car Buried: మనిషి అంటేనే భావోద్వేగాలు.. బంధాలు.. అనుబంధాలు.. ఎమోషన్స్ అన్నీ మానవునిలో కనిపించే సహజమైన లక్షణాలు. ప్రతి వ్యక్తికీ తన కుటుంబంతో.. బంధువులతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కొంతమంది విషయంలో అది మరింత ఎక్కువగా ఉంటుంది. కొందరికి పెంపుడు జంతువులతో అనుబంధం అపురూపంగా పెరిగిపోతుంది. మరికొందరిలో తాము వినియోగించే వస్తువుల విషయంలో అటువంటి బంధం ఏర్పడిపోతుంది. కాలం కరిగిపోయినా.. వస్తువు పాడై పోయినా దానిమీద మమకారం తీరదు. ఒకవేళ అది పనికిరానిదని తెలిసినా సరే.. దాని విషయంలో ఆ ఇష్టం చావదు. కొంతమంది ఇలా వస్తువుల మీద ఇష్టంతో అవి పాడైనపుడు బెంగ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ మనం చాలా ఇళ్లలో ఎప్పటిదో పాడైపోయిన టీవీని చూస్తున్న వారిని అక్కడక్కడా చూస్తుంటాం. బొమ్మ సరిగా రాకపోయినా సరే ఆ టీవీని చూస్తూ ఎంజాయ్ చేసేవారు ఉంటారు. అలా తమ కారుతో బంధం పెంచుకున్న ఒక కుటుంబం చేసిన పని తెలిస్తే ఆ కుటుంబాన్ని శభాష్ అనకుండా ఉండలేం.
గుజరాత్ లోని ఒక కుటుంబం దగ్గర ఒక మారుతి కారు ఉంది. దానికి కాలం తీరిపోయింది. అంటే, 15 ఏళ్ళు ముగిసిపోయాయి. ఇక స్క్రాప్ కి ఇచ్చేయాల్సిన సమయం వచ్చేసింది. స్క్రాప్ కి ఇచ్చేస్తే దానికి కొంత మొత్తం సొమ్ము వస్తుంది. కానీ, ఆ కుటుంబం తమకు కారుతో ఉన్న బంధాన్ని డబ్బుతో ముడివేయలేకపోయారు. ఇక కారును తప్పనిసరిగా విడిచిపెట్టేయాల్సిందే అనే నిజం వారిని బాధలో ముంచెత్తింది. లక్కీ అని పేరుపెట్టుకుని.. దానిని తమ కుటుంబంలో ఒకటిగా భావించిన వారు కాలం తీరిన కారును అలా చెత్త కోసం ముక్కలు చేయాలనే ఊహను భరించలేకపోయారు. దీంతో దానిని పాతిపెట్టాలని నిర్ణయించుకున్నారు. దానికోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆత్మీయుడైన కుటుంబ సభ్యుడు చనిపోతే, ఎటువంటి విధంగా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో అలానే.. ఆ కారుకు అంత్యక్రియలు నిర్వహించారు. దానిని సమాధి చేశారు. అది కూడా ఎదో గుంత తీసి కప్పిపెట్టడం కాదు. దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు పెట్టి.. శాస్త్రోక్తంగా విధిని నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Viral News: రీల్స్ కోసం బ్లాక్ ఫ్లిప్.. లోయలో పడిపోయిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో
Car Buried: కారును పూలతో అలంకరించారు. దానికోసం పది అడుగుల లోతులో ఒక గొయ్యిని సిద్ధం చేశారు. సమాధి చేసేముందు చేయాల్సిన క్రతువులు కుటుంబం అంతా కలిసి నిర్వహించారు. తరువాత జాగ్రత్తగా ఆ గోతిలోకి కారును దింపి.. పూడ్చివేశారు. ప్రతి పనిని ఒక మనిషికి చేసే అంత్యక్రియలు ఎలా ఉంటాయో అంతటి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కారును ఊరేగించారు. డీజే, సంగీత వాద్యాలతో శవ యాత్ర నిర్వహించారు. అంతకు ముందురోజు రాత్రి ఊరంతటికీ భోజనాలు పెట్టారు. ఈ విందుకు 1500 మందికి పైగా హాజరయ్యారు.
ఔరా అనిపిస్తున్న ఈ కారుకు సమాధి.. గుజరాత్ లోని అమ్రేలి జిల పదర్సింగ గ్రామంలో జరిగింది. అసలు ఈ కారుపై కుటుంబానికి అంత ప్రేమ ఎందుకో తెలుసుకోవాలి కదా. అది కూడా చెప్పుకుందాం. సంజయ్ పొర్ల అనే వ్యక్తి 2014లో ఈ సెకండ్ హ్యాండ్ కారును కొన్నారు. కారు కొన్న తరువాత సంజయ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి మారుతూ వచ్చింది. తమ వ్యవసాయం బాగా సాగింది. వారి వ్యాపారాలు కూడా బాగా పెరిగాయి. దీంతో లక్కీ అని పేరుపెట్టుకుని కారును వారి ఇంటి సభ్యుడిలా చూసుకుంటూ వచ్చారు. కారు కాలపరిమితి తీరిపోయాకా.. దానిని ఇప్పుడు స్క్రాప్ చేయడం కంటే ఇంకోమార్గం లేదు. సంజయ్ కి దానిని అలా చేయడం ఇష్టం లేదు. అందుకే కారుకు అంత్యక్రియలు నిర్వహించి గోతిలో సమాధి చేశారు. అన్నట్టు ఇప్పుడు కారును సమాధి చేసిన దగ్గర ఒక చెట్టును పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అది తమ కారు గుర్తుగా కలకాలం తమ కుటుంబానికి కనిపిస్తూనే ఉంటుందని సంజయ్ చెబుతున్నారు.