Suicide Crime News: జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. నిత్య హైదరాబాద్‌లోని రిషి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న స్నేహితులు సంజన, వైష్ణవి కొద్ది రోజులుగా నిత్యను తీవ్రంగా అవమానిస్తూ, “నీవు చదువులో వెనుకపడిపోయావు” అంటూ మాటలతో బాధపెట్టారు.
ఈ విషయంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిత్య ఈ నెల 1వ తేదీ ఇంటికి వచ్చింది. అక్కడ కూడా తీవ్రంగా దిగులుగా ఉంటూ, జూలై 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి తొలుత జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక నిత్య జూలై 4వ తేదీ ఉదయం మృతిచెందింది.
ఇది కూడా చదవండి: Delhi Double Murder: ఇద్దరిని హత్య చేసిన పనివాడు, నేరం ఒప్పుకొని.. ఏం చెప్పాడంటే ?
నిత్య తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు సంజన, వైష్ణవి అనే యువతులపై కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్సై సదాకర్ తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిత్యకు తల్లిదండ్రులు తిరుపతి, సునీత, ఒక సోదరుడు ఉన్నారు. కూతురు మృతి వార్త తెలిసి కుటుంబ సభ్యులు బాధలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు కూడా సానుభూతిని తెలిపారు.