KTR

KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు

KTR: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ, తన భవిష్యత్ కార్యాచరణను ఆయన అధికారికంగా ప్రకటించారు.

2027లో కచ్చితంగా పాదయాత్ర.. ఫిట్ అవ్వాలని చూస్తున్నా

మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్ తన పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది (2027లో) తాను కచ్చితంగా పాదయాత్ర చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. పాదయాత్ర మొదలయ్యేలోపు శారీరకంగా పూర్తి ఫిట్‌గా అవ్వాలని చూస్తున్నాను  అని కేటీఆర్ ఈ సందర్భంగా చమత్కరించారు. అయితే ఈ పాదయాత్ర వచ్చే ఏడాది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది? ఏ ఏ సమయాల్లో జరగాలి? అనే పూర్తి షెడ్యూల్‌ను పార్టీలోని పెద్దలతో మాట్లాడి, చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు

పార్టీ దూకుడు, ప్రస్తుత రాజకీయ వ్యూహాలపై అడిగిన మరో ప్రశ్నకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “మా పార్టీ గుర్తు కారు. కారును ఏ స్పీడ్‌లో నడపాలి, ఎప్పుడు ఏ గేర్ మార్చాలి అనేది మాకు బాగా తెలుసు” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలిటిక్స్‌ను ఎదుర్కోవడానికి తమ పార్టీ తయారు చేసిన ద్వితీయ శ్రేణి నాయకత్వం, నేతలు చాలని.. రేవంత్ రెడ్డి స్థాయికి వారే సరిపోతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ మా ‘తురుపు ముక్క’.. ఆయన తెలంగాణ ఓజీ!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్, ఎంట్రీ గురించి కేటీఆర్ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఇప్పుడే బయటకు రానవసరం లేదు. ఆయన మా పార్టీకి ఒక ‘తురుపు ముక్క’ (Trump Card) లాంటివారు. ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలో, ఎలా రావాలో, వచ్చి ఏం చేయాలో ఆయనకు పూర్తి స్పష్టత ఉంది. ఆ నిర్ణయం ఆయనే తీసుకుంటారు. దానికి ఒక సమయం ఉంది, ఆ టైమ్‌కు ఆయన కచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆయనే తెలంగాణకు అసలైన ‘ఓజీ’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *