DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ బుధవారం (జూన్ 3న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ పగ్గాలు చేపడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దేశ రాజధాని నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు తరలివస్తున్నారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు వివిధ సర్వధర్మ మఠాధిపతులు, పలు సంఘాల ప్రతినిధులు, సినిమా మరియు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి సాక్ష్యంగా నిలవనున్నారు.
ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌తో పాటు కనీసం మరో పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మంత్రుల జాబితాపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. మంత్రి పదవుల కోసం గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి డీకే శివకుమార్, సిద్ధరామయ్యలతో పాటు దాదాపు 30 మంది ఆశావహులు ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం ఒక స్పష్టమైన వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. మొదటి విడతలో అనుభవజ్ఞులైన సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చి, ఆ తర్వాత జరిగే విస్తరణలో జూనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
