Brahma Anandam

Brahma Anandam: బ్రహ్మ ఆనందం: తాతా కొడుకుల అనుబంధాల కథ

Brahma Anandam: బ్రహ్మ ఆనందం సినిమా పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఇందులో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజాగౌతమ్ ప్రధాన పాత్రల్లో తాతా మనవాళ్లుగా నటించారు. అలాగే, చాలాకాలం తరువాత బ్రహ్మానందం ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. అంతేకాకుండా, గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు బాగా ప్రమోషన్ చేశారు. ఇప్పుడు సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రియా వడ్లమాని, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
బ్రహ్మానందం (రాజా గౌతమ్) థియేటర్ ఆర్టిస్ట్. తన కెరీర్‌లో బ్రేక్ కోసం చాలా కష్టపడుతుంటాడు. ఒకరోజు అతను వృద్ధాశ్రమంలో ఉన్న తన తాత ఆనందం (బ్రహ్మానందం)ను కలుస్తాడు. తన గ్రామానికి వచ్చి ఒక ప్రత్యేక పనిలో సహాయం చేస్తే తన నాటకానికి స్పాన్సర్‌షిప్ ఇస్తానని తాత చెబుతాడు. దాంతో సంతోషపడిన బ్రహ్మానందం తన తాతతో కలిసి ఊరికి వెళ్తాడు. అక్కడ తన తాత నిజస్వరూపం తెలుసుకుంటాడు. తన మనవడి కోసం తాత ఏం ప్లాన్ చేశాడు? పరిస్థితులు ఎలా మారాయి? అన్నదే సినిమా కథ.

ఎవరెలా చేశారంటే.

సినిమాకు ప్రధాన హీరో రాజా గౌతమ్. తన టాలెంట్ చూపించడానికి అతనికి చక్కటి పాత్ర లభించింది. చాలా రోజుల తర్వాత అతను రీఎంట్రీ ఇచ్చాడు. నిరాశలో కూరుకుపోయిన యువకుడిగా అద్భుతంగా నటించాడు. ద్వితీయార్ధంలో తాతపై ప్రేమను చూపించడం, పాటల్లో డ్యాన్స్ చేయడం చాలా బాగుంది. అతని నటన గతంలో కంటే చాలా మెరుగుపడింది.
బ్రహ్మానందానికి పరిణితి చెందిన పాత్ర లభించింది. ఆయన కూడా న్యాయం చేశారు. ఇంతకు ముందులా చురుగ్గా లేకపోయినా బాగానే చేశారు. తన కుమారుడు రాజా గౌతమ్‌తో కొన్ని కామెడీ సన్నివేశాలు బాగా రూపొందించారు.
వెన్నెల కిషోర్ తన పాత్రలో చాలా బాగా నటించాడు. మంచి నవ్వులు తెప్పించాడు. చాలా రోజుల తర్వాత అతనికి పూర్తి స్థాయి పాత్ర లభించింది. దానికి న్యాయం చేశాడు. రాజా గౌతమ్‌తో అతని కామెడీ బాగుంది.
ప్రియా వడ్లమాని పక్కింటి అమ్మాయిగా ఆకట్టుకుంది. అయితే, ఆమె తన టాలెంట్ చూపించడానికి తగినంత స్క్రీన్ స్పేస్ లేదు. రాజీవ్ కనకాల, సంపత్ తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు.

Also Read: Potatoes: మీకు బంగాళాదుంపలు ఇష్టమా..? అయితే ఈ సమస్యలు పక్కా..

టెక్నీకల్ గ ఎలా ఉందంటే..
ఆర్.వి.ఎస్ నిఖిల్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన ఎంచుకున్న కథ చాలా బాగుంది. కానీ దాన్ని తెరపైకి తీసుకురాలేకపోయారు. సినిమా పూర్తిగా కామెడీగానూ, ఎమోషనల్‌గానూ లేదు. రెండింటి మధ్యలో చిక్కుపోయింది.
సినిమాకు అతి పెద్ద లోపం పాత్రల మధ్య భావోద్వేగ బంధం. సినిమా క్లిక్ అవ్వాలంటే బ్రహ్మానందం, రాజా గౌతమ్ మధ్య బలమైన భావోద్వేగాలు ఉండాలి. కానీ అది జరగలేదు. కీలక పాత్రల్లో కెమిస్ట్రీ మిస్సయింది.
సినిమా వేగం కూడా చాలా నెమ్మదిగా ఉంది. అసలు విషయానికి వెంటనే రాలేదు. సంధిల్య సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేసింది.
చిన్న పట్టణ నేపథ్యాన్ని బాగా చూపించినందున కెమెరా పనితనం, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్తా బాగుండాల్సింది.
ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. ద్వితీయార్ధంలో కొన్ని కామెడీ సన్నివేశాలు కథనంతో కలిసిపోయాయి. కానీ క్లైమాక్స్ అంత గొప్పగా లేదు. విషయాలు హడావుడిగా ముగించారు.
మొత్తమ్మీద దర్శకుడు ఇటు కామెడీ.. అటు ఎమోషన్స్ మధ్యలో ఎటూ తేల్చుకోలేక సినిమాని ఎటో ఎటో తీసుకుపోయినట్టనిపించింది.

ALSO READ  Akhil Akkineni: ‘లెనిన్’ రెగ్యులర్ షూటింగ్ షురూ!

ప్లస్ పాయింట్స్:
కథాంశం
రాజా గౌతమ్ నటన
వెన్నెల కిషోర్ కామెడీ
మైనస్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే కథనం
ఎమోషన్స్ లోతుగా లేకపోవడం
ఊహించదగిన కథ

చివరిగా..
బ్రహ్మ ఆనందం మూవీ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూడదగ్గ సినిమాగా ఉంది. కథ మంచిది కానీ, కథనం ఆకట్టుకోదు. కొన్ని కామెడీ సీన్స్ ఎంజాయ్ చేయడం కోసం సినిమాని చూడొచ్చు. ఆ.. తర్వాత టీవీల్లో వచ్చేస్తాయిగా అంటారా? అది మీ ఇష్టం.
గమనిక: ఈ రివ్యూ రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఈ సినిమా చూడమని కానీ.. చోడొద్దు అని కానీ ఈ ఆర్టికల్ చెప్పడం లేదు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *