Bollywood:  ‘ధురంధర్’కు రూ. 90 కోట్ల నష్టం

Bollywood: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించినప్పటికీ, గల్ఫ్ దేశాల్లో నిషేధం కారణంగా భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంది. ఈ చిత్రం గల్ఫ్ మార్కెట్లలో విడుదల కాకపోవడంతో సుమారు రూ. 90 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా వెల్లడించారు.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాకిస్థాన్ వ్యతిరేక కంటెంట్ ఉండటమే నిషేధానికి కారణమని సమాచారం. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమాకు అనుమతి లభించలేదు. మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లో యాక్షన్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుందన్న కారణంగా ఈ నిషేధం వల్ల గణనీయమైన బాక్సాఫీస్ ఆదాయం కోల్పోయామని డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రణబ్ కపాడియా మాట్లాడుతూ,
“మిడిల్ ఈస్ట్‌లో విడుదల అయితే కనీసం 10 మిలియన్ డాలర్లు (రూ. 90 కోట్లు) వసూళ్లు వచ్చేవి. కానీ ప్రతి దేశం తమ నిబంధనలను పాటించాల్సిందే. గతంలో ‘ఫైటర్’ వంటి చిత్రాలు కూడా అక్కడ విడుదల కాలేదు” అని పేర్కొన్నారు.

అయితే, ఈ నష్టాలున్నప్పటికీ డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి 2025లో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో నిర్మాతలు ఇప్పటికే ‘ధురంధర్ 2’ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్ 2026 మార్చి 19న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *