Majji Srinivasa Rao

Majji Srinivasa Rao: టీడీపీలో చేరిన చిన్న శ్రీను.. ఉత్తరాంధ్రలో మారిన రాజకీయ సమీకరణాలు..

Majji Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరి సహస్ర, పలువురు ముఖ్య అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు వారికి స్వయంగా పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ చేరిక కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సీనియర్ నేత కిమిడి కళావెంకటరావుతో పాటు పలువురు కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అభివృద్ధిలో భాగస్వామ్యం కోసమే టీడీపీలోకి.. చిన్న శ్రీను

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు ఏళ్లలోనే అమరావతి నిర్మాణం, సంక్షేమం, సాగునీరు, పారిశ్రామికాభివృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నాయని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఆకర్షితుడై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పలువురు ముఖ్య వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరబోతున్నారని ఆయన సంకేతాలు ఇచ్చారు.

ఉత్తరాంధ్రలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ..

ఉత్తరాంధ్ర వైసీపీకి వెన్నెముకగా నిలిచిన అత్యంత కీలకమైన చిన్న శ్రీను పార్టీని వీడటం ఆ పార్టీ క్యాడర్‌ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం (భీమిలి) జిల్లాల్లో చిన్న శ్రీనుకు ఉన్న బలమైన కేడర్, పట్టును దృష్టిలో ఉంచుకుని ఆయనకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం, కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *