Bittu Tabahi: మధ్యప్రదేశ్‌లో కాలుష్య కోరల్లో చిక్కుకున్న అజ్నార్ నదిని ఒంటిచేత్తో శుభ్రం చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న 20 ఏళ్ల యువకుడు సురేంద్ర సింగ్ చౌధరీ అలియాస్ ‘బిట్టూ తబాహి’ (Bittu Tabahi).. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నదిని ప్రక్షాళన చేసే భారీ మిషన్‌ను ప్రారంభించాడు. ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం (World Cleanup Day – సెప్టెంబర్ 20) సందర్భంగా మొదలైన ఈ మూడు రోజుల క్లీనప్ డ్రైవ్‌లో మొదటి రోజే స్వచ్ఛంద సేవకులు, స్థానికుల సహకారంతో యమునా నది ఒడ్డు నుంచి ఏకంగా 585 కేజీల వ్యర్థాలను తొలగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
యమునా తీరంలో 4 గంటల శ్రమ – 585 కేజీల వ్యర్థాలు మాయం..
సెప్టెంబర్ 20న ఆదివారం సుమారు నాలుగున్నర గంటల పాటు బిట్టూ తబాహి తన బృందంతో కలిసి యమునా నది ఒడ్డున పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, పూజల సామాగ్రి, పూలదండలు, కుళ్లిన వ్యర్థాలను తొలగించాడు. బిట్టూ చేస్తున్న నిస్వార్థ సేవను చూసి చుట్టుపక్కల నివసించే స్థానికులు, వాలంటీర్లు స్వచ్ఛందంగా నది ఒడ్డుకు చేరుకుని వ్యర్థాలను సేకరించడంలో చేతులు కలిపారు.
“ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం నాడు నాలుగున్నర గంటల పాటు యమునా తీరంలో శ్రమించి అందరం కలిసి 585 కేజీల చెత్తను తొలగించాం. వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ బిట్టూ పెట్టిన ఇన్స్టాగ్రామ్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ అజ్నార్ నది నుంచి మొదలైన ప్రయాణం..
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన బిట్టూ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న అజ్నార్ నది ప్లాస్టిక్ డంపింగ్ యార్డులా మారడంతో చలించిపోయి.. ఈత రాకపోయినా, చేతులకు సరైన గ్లౌజ్‌లు, బూట్లు లేకపోయినా నదిలోకి దిగి ఒంటిచేత్తో వ్యర్థాలను బయటకు లాగాడు.
అతని వీడియోలు వైరల్ కావడంతో నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ సీఈఓ బోయన్ స్లాట్ స్వయంగా బిట్టూకు ఉద్యోగం ఆఫర్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం బిట్టూ శ్రమను కొనియాడుతూ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వీడియోను పంచుకోవడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.అజ్నార్ నది తర్వాత బెంగళూరు కనకపుర రోడ్డు సమీపంలోని తురహళ్లి అటవీ ప్రాంతంలో 100 మంది వాలంటీర్లతో కలిసి భారీ ప్లాస్టిక్ క్లీనప్ డ్రైవ్ నిర్వహించాడు.
తదుపరి లక్ష్యం గురుగ్రామ్..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన జీవిత లక్ష్యమని బిట్టూ వెల్లడించాడు. ఢిల్లీలోని యమునా నది శుభ్రత ప్రక్రియ పూర్తయ్యాక, హర్యానా గురుగ్రామ్‌లోని ఖేడ్కీ దౌలా ప్రాంతంలో తదుపరి క్లీనప్ డ్రైవ్ చేపట్టనున్నట్లు స్పష్టం చేశాడు.
View this post on Instagram
