Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా రాబోతున్న ల్యాండ్‌మార్క్ 10వ సీజన్ ఈసారి ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో, పది రెట్ల వినోదాన్ని పంచడానికి సన్నాహాలు వేగంగా జరుపుకుంటోంది. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైనప్పటి నుండి హౌజ్‌లోకి వెళ్లే సెలబ్రిటీలు ఎవరనే చర్చ సోషల్ మీడియాలో పీక్స్‌కు చేరింది. కాగా, ఈసారి కంటెస్టెంట్ల లీక్డ్ లిస్ట్‌లో ఒకప్పటి స్టార్ హీరోయిన్, టాప్ సీరియల్ నటి ఇంకా క్రేజీ యూట్యూబర్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
1. బిగ్ బాస్ హౌజ్‌లోకి వివాదాస్పద సీనియర్ హీరోయిన్ కస్తూరి?
ఈ పదో సీజన్‌లో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఒక కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కస్తూరి.. ఈ స్పెషల్ సీజన్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారు.
హోస్ట్ నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘అన్నమయ్య’లో కస్తూరి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ‘తమిళ బిగ్ బాస్ సీజన్ 3’ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. అందుకే ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా, ఈ తెలుగు సీజన్ కోసం వారానికి ఏకంగా రూ. 1 లక్ష వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
2. ఎంట్రీ ఇవ్వనున్న టాప్ సీరియల్ భామ ప్రియాంక నల్కర్!
కస్తూరితో పాటు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో పాత పరిచయమున్న సీరియల్ నటి ప్రియాంక నల్కర్‌ను కూడా ఈసారి షోలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శర్వానంద్ ‘అందరి బంధువయా’ సినిమాతో కెరీర్ ప్రారంభించి.. నా సామి రంగా, కిక్ 2, హైపర్, కాంచన 3 వంటి చిత్రాల్లో నటించిన ప్రియాంక, ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. ‘మంగమ్మ గారి మనవరాలు’, ‘శ్రావణ సమీరాలు’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియన్స్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ఈసారి బిగ్ బాస్ 10 నుండి ఆఫర్ వస్తే మాత్రం కచ్చితంగా వెళ్తానని స్పష్టం చేశారు. “ఈసారి ఫస్ట్ కంటెస్టెంట్ మీరేనా?” అని వర్ష అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం చెప్పకుండా కేవలం నవ్వేయడంతో.. ఆమె రాక దాదాపు ఖాయమనే అంచనాకు ఆడియన్స్ వచ్చేస్తున్నారు.
3. ‘నందుస్ వరల్డ్’ నందన ఎంట్రీపై జోరుగా ప్రచారం!
ఇక డిజిటల్ మీడియా నుండి ప్రముఖ యూట్యూబర్ నందన పేరు కూడా ఈ జాబితాలో చేరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘నందుస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్‌తో విస్తృతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న నందన ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన నందన, ఇటీవల వీసాకు సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచారు. ఆ ఘటనతో ఆమెకు పబ్లిక్ లో గుర్తింపు మరింత పెరిగింది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో ఆమె ఓ పాత్రలో నటించారు. సోషల్ మీడియా క్రేజ్‌తో పాటు సినిమా అనుభవం కూడా ఉండటంతో, బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను హౌస్‌లోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారిక ప్రకటన బాకీ:
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు భామలతో షో నిర్వాహకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయని టాక్ నడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు స్టార్ మా యాజమాన్యం గానీ, షో నిర్వాహకులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా అఫీషియల్ లాంచ్ డేట్ వచ్చే వరకు కంటెస్టెంట్ల జాబితాలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, లీక్ అయిన ఈ పేర్లు చూస్తుంటే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ బాక్సాఫీస్ రేటింగ్‌లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
