Prakashraj: ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మృతదేహాల ఖననం వివాదం, రూ. 200 కోట్ల డీల్ ఆరోపణలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ కేసులో ‘ముసుగు వ్యక్తి’గా ప్రచారంలో ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. బుధవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై పూర్తి వివరాలను వెల్లడించారు.
ఆ ఆలయంతో నాకేం సంబంధం లేదు:
“ధర్మస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కేరళ నుండి రూ. 200 కోట్లు వచ్చాయని, ఆ విషయం ప్రకాష్ రాజ్‌కు కూడా తెలుసు” అంటూ చిన్నయ్య చేసిన ఆరోపణలను ప్రకాష్ రాజ్ పూర్తిగా కొట్టిపారేశారు. నేను నా జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ధర్మస్థలకు వెళ్లలేదు. ఆ ఆలయ బాధ్యులను గానీ, దానికి సంబంధించిన వారిని గానీ ఏనాడూ కలవలేదు అని ఆయన స్పష్టం చేశారు.
చిన్నయ్యతో ఫోన్ కాల్.. ముందే అలర్ట్ చేసిన ప్రకాష్ రాజ్:
చిన్నయ్య అనే వ్యక్తి తన లైన్లోకి ఎలా వచ్చాడనే దానికి ప్రకాష్ రాజ్ ఒక స్పష్టత ఇచ్చారు.
మాజీ పోలీస్ అధికారి, తన సహ కార్యకర్త అయిన గిరీశ్ మట్టణ్ణనవర్ తనకు ఫోన్ చేసి.. మండ్యకు చెందిన చిన్నయ్య అనే వ్యక్తి మీతో మాట్లాడాలని కోరుతున్నాడని ఫోన్ ఇచ్చారు. అతను కన్నడ రానట్లుగా తనతో తమిళంలో మాట్లాడాడని, వ్యక్తిగతంగా భేటీ అవుతానని అడగడంతో తాను నిరాకరిస్తూ ఒక ‘వాయిస్ నోట్’ పంపినట్లు తెలిపారు.
చిన్నయ్య మాటల తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో, వెంటనే ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ (SIT) అధిపతి, ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీకి ఫోన్ చేసి ఈ విషయాన్ని ముందే చేరవేశానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అంతేకాదు, ధర్మస్థల ఆరోపణలపై వాస్తవాలు నిగ్గుతేల్చడానికి దర్యాప్తునకు ఆదేశించాలని అప్పటి సీఎం సిద్ధరామయ్యను మొదట కోరింది తానేనని ఆయన గుర్తుచేశారు.
జర్నలిస్టుల ఆగ్రహం.. వెనక్కి తగ్గిన నటుడు:
ఈ ప్రెస్‌మీట్ సందర్భంగా ప్రకాష్ రాజ్ ‘అమ్ముడుపోయిన ప్రచార మాధ్యమాలు’ (Paid Media) అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అక్కడ ఉన్న విలేకరులు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిలదీశారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ప్రకాష్ రాజ్ వెంటనే సర్దుబాటు చేసుకుంటూ.. “తాను అందరినీ ఉద్దేశించి ఆ మాట అనలేదని, కేవలం కొందరికి మాత్రమే అది వర్తిస్తుందని” సవరణ ఇచ్చుకున్నారు. కోర్టుల కంటే ముందే కొన్ని మీడియా సంస్థలు తీర్పులు ఇచ్చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
సౌజన్యకు న్యాయం జరగాలనేదే నా ఆకాంక్ష: నేను వ్యక్తిగతంగా దేవుళ్లను నమ్మను, దేవాలయాలకు వెళ్లను. కానీ నా భార్య పరమ భక్తురాలు. ఆమె నమ్మకాలను నేనెప్పుడూ ప్రశ్నించలేదు. సమాజంలో ఒక పౌరుడిగా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు నాకుంది. ధర్మస్థలలో జరిగిన విద్యార్థిని సౌజన్య హత్యాచారం కేసులో నిజమైన నిందితులకు కఠిన శిక్ష పడాలనేదే నా ఏకైక డిమాండ్. అంతేకాని, ధర్మస్థల ప్రతిష్ఠకు మసిపూసే ఉద్దేశం నాకు లేదు, అలాంటి దుష్ప్రచారాలను నమ్మకండి” అని ప్రకాష్ రాజ్ కోరారు.
