Bhatti Vikramarka

Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు శుభవార్త: దీపావళి బోనస్ రూ.400 కోట్లు!

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా రూ.400 కోట్ల బోనస్‌ను ఈరోజే చెల్లిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.

సింగరేణి ప్రస్థానం ఖమ్మం జిల్లా నుంచే మొదలైందని గుర్తు చేశారు. ఈరోజు సింగరేణి రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం ఎప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ వైఖరిని ఖండన
భట్టి విక్రమార్క మాట్లాడుతూ… తొలిసారిగా రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో కులగణన (సమాజ సర్వే) నిర్వహించామని చెప్పారు. సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేశామని తెలిపారు. గతంలో 2018లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే చట్టం చేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 50 శాతం పరిమితిని ఎత్తివేసిందని స్పష్టం చేశారు.

కేంద్రం అడ్డంకి
అయితే, బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇది బీజేపీ నైజం ఏమిటో దేశ ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బీసీ రిజర్వేషన్ విషయంపై మాట్లాడటానికి కలిసేందుకు కూడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.

తాము ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతిస్తున్నా… బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ బిల్లు న్యాయ స్థానాల్లో నిలిచిపోతుందని ఆయన అన్నారు.

బీసీల ‘బంద్‌’కు మద్దతు తెలపండి
రాష్ట్రంలోని ఓబీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ అని భట్టి విక్రమార్క అన్నారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

“బిల్లు అమలు జరగకపోవడం రాష్ట్రంలోని బీసీ ప్రజల గుండెకోతగా మిగిలిపోయింది. బీజేపీ బిల్లు ఆమోదం కోసం కృషి చేస్తే మేము మీ వెనుక నడుస్తాం. అడ్డగోలుగా బీజేపీ నాయకత్వం మాట్లాడుతోంది. బీసీ వర్గాలు అమాయకులు కాదు. బీసీ రిజర్వేషన్లకు ఇతర వర్గాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్‌కు కాంగ్రెస్ శ్రేణులతో పాటు అందరూ మద్దతు తెలపాలి,” అని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *