Hair Mask Remedies: పొడవైన, ఒత్తైన, కాంతివంతమైన జుట్టు ప్రతి ఒక్కరి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. కానీ నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి (Lifestyle), కాలుష్యం ఇంకా వాతావరణ మార్పుల కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. దీనివల్ల జుట్టు విపరీతంగా రాలడం, పొడిబారడం, చిన్న వయసులోనే తెల్లబడటం విటితోపాటు చుండ్రు (Dandruff) వంటి సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి.
మార్కెట్లో దొరికే ఖరీదైన, కెమికల్స్ ఉన్న హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌కు బదులుగా.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకోగల కొన్ని అద్భుతమైన హెయిర్ మాస్క్‌ల (Hair Masks) గురించి తెలుసుకుందాం.
1. చుండ్రు నివారణకు ‘మెంతుల హెయిర్ మాస్క్’
మెంతులలో యాంటీ ఫంగల్ – యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తల చర్మాన్ని (స్కాల్ప్‌ను) ఎలాంటి ఇన్ఫెక్షన్ల నుంచైనా కాపాడతాయి. మీరు చుండ్రు మరియు జుట్టు పొడిబారే సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటే.. ఈ మెంతుల హెయిర్ మాస్క్ ఒక రక్షకిలా పనిచేస్తుంది.
తయారీ విధానం: మెంతులను ఒక రాత్రి ముందే నీళ్లలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఆ నానిన మెంతులను మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మాస్క్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత తలస్నానం చేయాలి.
2. జుట్టు ఎదుగుదలకు ‘కొబ్బరి నూనె – దాల్చినచెక్క మాస్క్’
కొబ్బరి నూనె జుట్టుకు అద్భుతమైన తేమను అందించి, వెంట్రుకలు మధ్యలోకి తెగిపోకుండా కాపాడుతుంది. ఇది జుట్టును లోతుగా కండిషనింగ్ చేస్తుంది. ఇక దాల్చినచెక్కలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు జుట్టు వేగంగా పెరగడానికి (Hair Growth) తోడ్పడతాయి.
తయారీ విధానం: 1 పెద్ద చెంచా కొబ్బరి నూనె లో 1 చెంచా దాల్చినచెక్క పొడిని (Cinnamon Powder) కలిపి మిక్స్ చేసుకోవాలి. జుట్టును పాయలుగా విడదీసి, ఈ పేస్ట్‌ను కుదుళ్లకు ఇంకా జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. 30 నిమిషాల పాటు జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి ఉంచి, ఆపై షాంపూతో కడిగేయాలి.
3. పొడి జుట్టు సమస్యకు ‘పెరుగు, తేనె మరియు అరటిపండు మాస్క్’
అరటిపండులో సహజసిద్ధమైన నూనెలు, పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఇంకా విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనికి పెరుగును జోడించినప్పుడు.. అందులోని లాక్టిక్ యాసిడ్ జుట్టుకు మరింత మేలు చేస్తుంది. అరటిపండు, తేనె జుట్టును సిల్కీగా మార్చితే, పెరుగు జుట్టు పొడిదనాన్ని (Dryness) తగ్గిస్తుంది.
తయారీ విధానం: 1 అరటిపండును తీసుకుని మెత్తటి పేస్ట్‌లా మ్యాష్ చేయాలి. అందులో 2 పెద్ద చెంచాల పెరుగు, 1 చెంచా తేనె వేసి బాగా కలపాలి. జుట్టును కొద్దిగా తడి చేసి, ఈ మాస్క్‌ను స్కాల్ప్ నుండి కింద జుట్టు చివర్ల వరకు బాగా పట్టించి, 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
4. దురద నుండి ఉపశమనానికి ‘అలోవెరా – ఆముదం మాస్క్’
మీకు తలలో విపరీతంగా పొడిబారడం లేదా దురద వంటి సమస్యలు ఉంటే.. అలోవెరా (కలబంద) ఆముదం (Castor Oil) దీని నుండి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అలోవెరా స్కాల్ప్‌ను హైడ్రేట్ గా ఉంచితే, ఆముదం తలలో రక్తప్రసరణను (Blood Circulation) పెంచి జుట్టు ఊడకుండా చేస్తుంది.
తయారీ విధానం: 2 పెద్ద చెంచాల ఫ్రెష్ అలోవెరా జెల్లో 2-3 చుక్కల ఆముదం నూనె వేసి బాగా కలపాలి. దీన్ని తల చర్మానికి బాగా పట్టించి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మొదట సాధారణ నీటితో జుట్టును కడిగి, ఆపై మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి.
గమనిక
ఈ సహజసిద్ధమైన హెయిర్ మాస్క్‌లు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఇందులో ఉపయోగించిన ఏ పదార్థం వల్లనైనా మీకు అలర్జీ (Allergy) వచ్చే అవకాశం ఉంటే, దాన్ని వాడకపోవడమే మంచిది. సమస్యలు మరీ ఎక్కువగా ఉంటే నిపుణులైన ట్రైకాలజిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ఈ ఆర్టికల్ కేవలం ఆన్ లైన్ లో దొరికిన సమాచారం ప్రకారం మాత్రమే రాయబడింది దీనిని మహా న్యూస్ ధృవీకరించలేదు.
