Bank: తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)గా రూపాంతరం చెందుతుంది. ఈ నెల 28న మొదలైన విలీన ప్రక్రియ జనవరి 1 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ మేరకు డిసెంబర్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సేవలను బ్యాంకు ఉన్నతాధికారులు నిలిపివేశారు. ఈ మేరకు ఖాతాదారులకు సమాచారాన్ని కూడా చేరవేశారు.
Bank: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) శాఖలు తెలంగాణలో 493 ఉన్నాయి. మరోవైపు తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) శాఖలు 435 ఉండగా, రూ.30 వేల కోట్ల వ్యాపారం నడుస్తున్నది. ఇప్పుడు ఈ రెండు బ్యాంకుల విలీనం తర్వాత 928 శాఖలతో 70 వేల కోట్ల వ్యాపారంతో వినియోగదారులకు టీజీబీ సేవలు అందించనున్నది. విలీనం తర్వాత దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవతరించనున్నది.
Bank: గ్రామీణ బ్యాంకులను పటిష్ఠపర్చే ఉద్దేశంతో కేంద్రం ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం నేపథ్యంలోనే ఈ విలీనం జరుగుతున్నది. విలీన ప్రక్రియ నేపథ్యంలో యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సైతం అందుబాటులో ఉండవని బ్యాంకుల ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. ఖాతా నంబర్ మాత్రం మారదని, ఇంకా బ్యాంకుకు సంబంధించిన సందేహాలు ఉంటే బ్యాంకు బ్రాంచీల్లో సంప్రదించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఖాతాదారులు సహకరించాలని బ్యాంకు ఉన్నతాధికారులు కోరారు.