Balmuri Venkat: సినీ నటుడు అల్లు అర్జున్ వైఖరిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ దశలో నటుడు అల్లు అర్జున్ మాట్లాడిన తీరును వెంకట్ తప్పుబట్టారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెడతారనుకుంటే పశ్చాతాపం వ్యక్తం చేస్తారని భావించామని బల్మూరి వెంకట్ తెలిపారు. కానీ అలా కాకుండా తనను తాను సమర్థించుకునేందుకు యత్నించాడని ఆరోపించారు.
Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ వైఖరి అభ్యంతరకరంగా ఉన్నదని బల్మూరి వెంకట్ విమర్శించారు. మూవీ చూస్తూ ఎంజాయ్ చేశారని, అభిమానులను విష్ చేసుకుంటూ, నెట్టుకుంటూ వెళ్లాడని తెలిపారు. ఘటన తెలిసిన తర్వాత కూడా ఇంటి వద్ద టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. తెలుగోళ్ల సత్తా చాటామని చెప్పుకుంటున్న ఆయన, జరిగిన దుస్సంఘటనపైనా మానవత్వంతో స్పందించాలని చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అల్లు అర్జున్ మాటలను వెనక్కి తీసుకోవాలని వెంకట్ డిమాండ్ చేశారు.