Sakshi Conspiracy: అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని. బౌద్ధ చారిత్రక వైభవం గల పవిత్ర నేల. కానీ, సాక్షి మీడియా ద్వారా ఈ ప్రాంతాన్ని “వేశ్యల రాజధాని”గా చిత్రీకరించి, మహిళలను అవమానించిన దుర్మార్గం రాష్ట్రాన్ని కుదిపేసింది. సోకాల్డ్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుల వ్యాఖ్యల వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేసేశారు. ఈ వివాదం వెనుక పార్టీ-మీడియా కుమ్మక్కైన దుర్మార్గం, అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలనే అజెండా స్పష్టంగా కనిపిస్తోంది.
వైసీపీ అధినేత ఆదేశాలతోనే సాక్షి మీడియా, కొమ్మినేని, కృష్ణంరాజులు రెచ్చిపోయారా? హైదరాబాద్‌లో జరిగిన రహస్య సమావేశంలో వైసీపీ నాయకులు, సాక్షి ప్రతినిధులు, గత ప్రభుత్వంలో జగన్ భజన పరులుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు మాజీ అధికారులు కలిసి కుట్ర రచించినట్లు ఇటీవల బయటకొచ్చిన వార్తలు నిజాలేనని తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమౌతోంది. కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రేకెత్తించడం, శాంతి భద్రతలపై అపోహలు సృష్టించడం, అంతిమంగా అమరావతిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమౌతోంది. “అవసరమైతే అమరావతి మహిళలపై బూతులు తిట్టించండి, అధినేత చూసుకుంటాడు” అంటూ ఆ రహస్య సమావేశంలోనే సూచనలు జారీ అయ్యాయట. ఈ ఆదేశాలతోనే కృష్ణంరాజు నీచ వ్యాఖ్యలు చేయగా, కొమ్మినేని వాటిని ఖండించకుండా నవ్వుతూ సమర్థించారని తెలుస్తోంది. ఓ మీడియా సంస్థ, రాజకీయ పార్టీతో కలిసి ప్రభుత్వంపై, రాష్ట్రంపై కుట్రలు రచించడం ఇదే మొదటి సారి అంటున్నారు పలువురు సీనియర్ విశ్లేషకులు.
Also Read: MLA Sudarshanreddy: సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన
Sakshi Conspiracy: అమరావతి మహిళలపై అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఎవరి వ్యక్తిగత వ్యాఖ్యలో కాదనీ, వ్యవస్థీకృతంగా జరిగిన కుట్ర అని స్పష్టం చేశారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన, బౌద్ధం విలసిల్లిన అమరావతిని అవహేళన చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను కించపరచడం రాజకీయ దురుద్దేశమేనని ఆయన హెచ్చరించారు. రాజధాని కోసం భూములిచ్చిన 32% ఎస్సీ/ఎస్టీలు… 14% బీసీ రైతులను కూడా ఈ వ్యాఖ్యలు గాయపరిచాయన్నారు. ఈ కుట్రకు సంబంధించి… తన దృష్టికి వచ్చిన ఖచ్చితమైన సమాచారంతోనే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
2019 ఎన్నికలకు ముందు వైసీపీ అమరావతికి ఎస్ చెప్పింది. అధికారంలోకి రాగానే కుట్రలకు తెరతీస్తూ మూడు రాజధానుల స్టాండ్ తీసుకుంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందా అంటే సమాధానం లేదు. కానీ అమరావతిపై అభిప్రాయం మార్చుకోలేదని మాత్రం స్పష్టమౌతోంది. ఎందుకంటే అమరావతి అభివృద్ధి వైసీపీ వెన్నులో ఒణుకు పుట్టిస్తోందా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమరావతి పూర్తయితే వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే భయంతోనే ఈ నీచ కుట్రకు తెరలేపారని తెలుస్తోంది. రాజధానిని శ్మశానంతో పోల్చడం, కుల ముద్రలు వేయడం, మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఇందులో భాగమే. సాక్షి ఇప్పుడు “మాకు సంబంధం లేదు” అంటూ కొమ్మినేని, కృష్ణంరాజులను బలిపశువులుగా చేయొచ్చు… కానీ, ఈ చర్చను నడిపించిన సాక్షి యాజమాన్యం ఇందులో నుంచి తప్పించుకోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు సాక్షిని ఏ3గా చేర్చడం, కఠిన చర్యలకు సిద్ధమవడం ఈ కుట్రపై ప్రభుత్వం సీరియస్‌నెస్‌ను చాటుతోంది అంటున్నారు.