Pawan warns Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘పుష్ప’ సినిమాలోని ‘రప్పా రప్పా నరుకుతాం’ డైలాగుతో వైసీపీ కార్యకర్త ఫ్లెక్సీ ప్రదర్శించడాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపాయి. పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ఈ డైలాగుతో బ్యానర్లు ప్రదర్శించడం, 2029లో అధికారంలోకి వస్తే ‘నరికేస్తాం’ అని హెచ్చరించడంపై కూటమి నేతలు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సినిమా నటుడిగా తన అనుభవాన్ని జోడిస్తూ “సినిమా డైలాగులు సినిమా హాల్‌లోనే బాగుంటాయి తప్ప, సమాజంలో, ప్రజాస్వామ్యంలో కాదు!” అని హెచ్చరించారు పవన్. చట్టాన్ని గౌరవించని, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిని, అసాంఘిక శక్తులకు మద్దతిచ్చేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని పిలుపునిచ్చారు. అలాంటివారిపై రౌడీ షీట్లు తెరుస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం అని పవన్ స్పష్టం చేశారు. జగన్ పేరు ప్రస్తావించకుండానే, జగన్ వ్యాఖ్యలకు చెక్ పెడుతూ, వైసీపీ శ్రేణులకు గట్టి వార్నింగ్ జారీ చేశారు డిప్యూటీ సీఎం. ఇప్పటికైనా జగన్ మారాలని, లేకపోతే చట్టం తన పని తాను చేస్తుందని పవన్ సూచనాత్మకంగా హెచ్చరించారు.
పవన్ పొలిటిషియన్ కన్నా ముందు సినిమా యాక్టర్. మామూలు యాక్టర్ కాదు. అశేష అభిమానులున్న పవర్ స్టార్. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తున్నారు. వాటిలో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో సహజంగానే సినిమా డైలాగులు దొర్లాలి. కానీ పవన్ రాజకీయ వేదికలపై మహానుభావులు, మేధావుల కొటేషన్లను వినిపిస్తుంటారు తప్ప.. సినిమా డైలాగులు పేల్చడం చాలా అరుదు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. పవన్ ప్రసంగాల్లో అసలు సినిమాటిక్ ప్రజెంటేషన్ పూర్తిగా కనుమరుగైందని చెప్పాలి. ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నారు, ప్రసంగిస్తున్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Also Read: Kingdom: కష్టాల్లో ‘కింగ్‌డమ్’.. విడుదలకు ముందే నెగెటివ్ టాక్?
Pawan warns Jagan: కానీ విచిత్రంగా ఫక్తు పొలిటీషియన్ అయిన జగన్ మోహన్ రెడ్డి నుండి తరచూ సినిమాటిక్ డైలాగులు వినిపిస్తుంటాయి. అన్నొస్తున్నాడని చెప్పు.. అన్న దగ్గరి నుండి మొదలైంది జగన్ సినిమా డైలాగుల ట్రెండ్. మాట తప్పను, మడమ తిప్పను.. అన్న డైలాగ్ కూడా ఆ ట్రెండ్ నుండి పుట్టుకొచ్చిందే. ఇప్పుడు ఏకంగా రప్పా రప్పా నరకాలి అంటూ ఫ్యాన్స్‌ని ప్రోత్సహిస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. రాజకీయం అంటే సినిమా కాదని సినీ హీరో అయిన పవన్ కళ్యాణే చెప్తున్నారు. కానీ జగన్ మాత్రం సినిమా హీరోలా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. సినిమా డైలాగులు థియేటర్ల వరకే పరిమితం, బయట సమాజంలో సినిమా డైలాగులు నడవవని, ప్రజాస్వామ్యంలో ఒళ్లు దగ్డర పెట్టుకుని మాట్లాడాలని పవన్ అంటోంటే… సినిమా డైలాగులే కదా, వాడేస్తే తప్పేంటి అంటూ.. నరుకుడు పోస్టర్లతో ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు జగన్ రెడ్డి. ఇదీ స్పష్టంగా పవన్ కళ్యాణ్‌కి, జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న తేడా.. అంటూ విశ్లేషిస్తున్నారు అనలిస్టులు.