Paritala Sri Ram 2.0: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం. రాజకీయం ఎప్పుడూ డిఫరెంట్‌గానే ఉంటుంది ఇక్కడ. గత ట్రాక్ రికార్డు చూసినా కూడా రాజకీయ విశ్లేషకులు ఇదే మాట చెబుతూ ఉంటారు. 2024 ఎన్నికలకు ముందు కూటమి టికెట్ విషయంలో థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు. లాస్ట్ లిస్ట్ వరకు అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగి, చివరికి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థికి టికెట్ ప్రకటించడం జరిగింది. ఆ విధంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. ముచ్చటగా 30 రోజుల్లోనే విజయం సాధించి మంత్రి అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. పాలన మొదలయ్యాక.. కూటమి నేతలు, కార్యకర్తలు పాలు నీళ్లలా కలిసిపోతారని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ ఉప్పు నిప్పులాగా చిట పటమంటూ కూటమి పార్టీలలో గందరగోళం మొదలైంది. ఏడాది పాలన పూర్తి కావస్తున్న వేళ.. ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. మీ దారి మీదే.. మా దారి మాదే.. అనే ఫైనల్ కంక్లూజన్‌కి కూడా వచ్చేశారంటున్నారు ఇక్కడి రాజకీయాలు నిశితంగా గమనిస్తున్న పరిశీలకులు.
పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టి దాదాపు నాలుగు సంవత్సరాలైంది. 2024 ఎన్నికల వరకూ క్యాడర్‌ని సమన్వయం చేసుకుంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. పాదయాత్రలో నారా లోకేష్ ఏకంగా పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి వస్తున్నారు అంటూ మరింత ఊపు తీసుకొచ్చారు క్యాడర్లో. కట్ చేస్తే… సీటు బీజేపీ ఎగరేసుకుపోయింది. యువ నేత పరిటాల శ్రీరామ్ కూడా పెద్ద మనుసు చేసుకొని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు జై కొట్టారు. ఇక కూటమి వేవ్‌లో.. బీసీ నాయకుడు, కేంద్ర రాష్ట్ర నాయకత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారనే కారణంతో సత్యకుమార్‌కు ఓట్లేసి కాషాయ జెండా రెపరెపలాడించారు ధర్మవరం ప్రజలు. అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. ఏ పార్టీ నాయకుడైనా.. అధికారంలో ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో తానే స్ట్రాంగ్ పిల్లర్‌గా ఎదగాలని చూస్తారు కానీ మరొకరికి ఆ చాన్స్ ఇవ్వరు. ధర్మవంరంలో బీజేపీ కూడా ఇదే గేమ్ మొదలుపెట్టింది అంటున్నారు విశ్లేషకులు. అయితే.. టీడీపీకి ఎప్పటి నుంచో గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టున్న నేపథ్యంలో.. ఇప్పుడు అధికార పక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది ధర్మవరంలో తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు ఇప్పట్లో బయటికి వచ్చి.. ప్రజల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు. ఆ పాత్రను టీడీపీనే పోషించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read: Industry vs Pawan: వీరమల్లు ట్రీట్మెంట్‌తో ఇండస్ట్రీ సెట్ అవుతుందా?
Paritala Sri Ram 2.0: తాజాగా ధర్మవరంలో టీడీపీ కార్యకర్తల మీటింగ్ జరిగింది. ధర్మవరం తనకు ఎంతో ఓపికను నేర్పించిందని, యుద్ధం తప్పదన్నప్పుడు అర చెయ్యే గొడ్డలవుతుందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమస్యలను ఏకరువు పెట్టారు. గడిచిన ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా ధర్మవరంలో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిని ఎంతో శ్రమించి గెలిపించామన్నారు. అయితే, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులను పురుగుల్లా చూస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో గడిచిన 11 నెలల నుంచి జరుగుతున్న సంఘటనలను చూసి మైండ్ డైవర్ట్ చేసుకోవద్దని కార్యకర్తలకు సూచించారు పరిటాల శ్రీరామ్. కొంతమంది డబుగేమ్ ఆడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తు పెట్టుకుంటానన్నారు. తాను చేపట్టే యుద్ధం వారితోనే మొదలు పెడతానన్నారు. మనకు పోరాటాలేమీ కొత్త కాదన్నారు పరిటాల శ్రీరామ్. మనకూ ఒక రోజు వస్తుందనీ, అప్పుడు ప్రతి ఒక్కరికీ గుర్తుంచుకుని మరీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, అందాకా అధైర్య పడకండి అంటూ క్యాడర్‌కి భరోసా ఇచ్చారు. పరిటాల శ్రీరామ్ ధర్మవరం విడిచి వెళ్లిపోతారంటూ ఏవేవో పుకార్లు క్రియేట్ చేస్తున్నారనీ.. వాటిని నమ్మొద్దనీ, ధర్మవరం ప్రజల కోసం.. ఇక్కడే ఉంటా.. ఇక్కడే రాజకీయం చేస్తా.. పరిటాల శ్రీరామ్ 2.0 ఇక్కడ నుంచే మొదలుపెడతా అంటూ ఘాటుగా స్పందించారు పరిటాల శ్రీరామ్.
మొత్తానికి ధర్మవరం నియోజకవర్గ రాజకీయం హాట్ హాట్‌గా కొనసాగుతుందని చెప్పొచ్చు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ పాత్ర లేకపోయినా… రాజకీయం మాత్రం మండే అగ్నిగోళంలాగా ఉందంటున్నారు. కూటమి పార్టీలలో ఏ నాయకుడిని కదిపినా… కరెంటు షాక్ లాగా ఫైర్ అవుతున్నారట. ఈ బర్నింగ్ ఎపిసోడ్ ఇప్పట్లో చల్లారే ప్రసక్తి లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రాబోయే కాలంలో ధర్మవరం రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.. వెయిట్ అండ్ సీ.