kamal hassan: నటుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన కన్నడ భాషపై వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ఆయనపై క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని కమల్ స్పష్టంగా ప్రకటించారు. “నిజంగా తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను. కానీ ఈ సందర్భంలో ఏ తప్పూ చేయలేదు” అని పేర్కొన్నారు.
‘థగ్ లైఫ్’ సినిమా ప్రీ-రిసీజ్ వేడుకలో కమల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఆయన మాట్లాడుతూ తమిళం నుంచే కన్నడ భాష ఉద్భవించిందని చెప్పడం పట్ల అక్కడి ప్రజలు, పార్టీలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి, మే 30లోగా క్షమాపణ చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది.
కమల్ స్పందిస్తూ, తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, భాషపై అసూయ లేదని వివరించారు. “ప్రేమ క్షమాపణ కోరదు” అని అన్నారు. భాషా చరిత్రపై మాట్లాడే అర్హత రాజకీయ నేతలకు లేదని, అదే తనకూ వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ విడుదలపై సస్పెన్స్ నెలకొంది.