Mahanadu Day 1 Highlights: కడప మహానాడును తెలుగుదేశం పార్టీ శ్రేణులు పసుపు ప్రభంజనంగా మార్చేశారు. వైసీపీ కంచుకోటగా పిలవబడే కడప జిల్లాలో టీడీపీ తమ్ముళ్లు కదం తొక్కి, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ, విదేశాల నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రోజుల ముందుగానే కడపకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించగా, స్థానిక కార్యకర్తలు స్వయంగా ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరవగా, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా అభిమానులు చేరుకున్నారు. కార్యకర్తలు పోటీపడి పాల్గొనడంతో కడపలో హోటల్స్, గెస్ట్ హౌస్‌లు కిటకిటలాడాయి.
2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. కడపలో 2024 ఎన్నికల్లో 10 స్థానాలకు 7 గెలిచి సత్తా చాటిన టీడీపీ, ఈ మహానాడును వైసీపీ కంచుకోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. 2019 తర్వాత వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో మహానాడు తొలిరోజును జయప్రదం చేశారు. పార్టీ అంచనాలకు మించి కార్యకర్తలు భారీగా హాజరవడంతో ఉత్సాహం రెట్టింపైంది. తెలంగాణలో 20 ఏళ్లకు పైగా అధికారం లేకపోయినా, టీడీపీ కార్యకర్తల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి మెదక్, అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి సొంత ఖర్చులతో కార్యకర్తలు కడపకు తరలివచ్చారు. తెలంగాణ చాలా జిల్లాల నుండి బస్సులు ఏర్పాటు చేసుకుని తరలిరావడం ఈ ఏడాది విశేషంగా నిలిచింది.
ఇక అధినేత చంద్రబాబు ప్రసంగం క్యాడర్‌లో ఉత్సాహం రగిలించింది. మహానాడు వేదికపై ఉద్వేగభరితంగా ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. “టీడీపీ కార్యకర్తలే నా ఆయుధాలు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఘనత మనది” అంటూ కొనియాడారు. 2024 ఎన్నికల్లో 57% ఓట్లతో ఘన విజయం అందించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ హయాంలో వేధింపులు, ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తలను స్మరించుకుని, వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. “తెలుగు జాతి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం” అని ప్రకటించారు చంద్రబాబు. కడపలో 7 స్థానాలు గెలిచిన టీడీపీ, వచ్చే ఎన్నికల్లో స్వీప్ చేస్తుందని వైసీపీకి సవాల్ విసిరారు.
Also Read: Chandrababu: తెలుగుజాతి ఆరాధించే ఏకైక నేత ఎన్టీఆర్.. నీతి, నిజాయతీ, పట్టుదల అయన ఆయుధాలు
Mahanadu Day 1 Highlights: ఇక మహానాడు వేదికపై లోకేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ ఆంక్షలు, అరెస్టుల మధ్య 2023లో కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం.. కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపగా, ప్రజలకు భరోసాని కలిగించింది. ఒంగోలు, విజయవాడలో లోకేష్ కోసం ప్రజలు బారులు తీరగా, విజయవాడలో తెల్లవారుజాము 3 గంటల వరకు పాదయాత్ర సాగింది. ఇక ఈ మహానాడులోనూ లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపించింది. మహానాడు ప్రాంగణం వద్దకు లోకేష్ చేరుకోగానే.. ఒక్కసారిగా అక్కడ వేవ్ మారిపోయింది. లోకేష్ వచ్చాడనంగానే అక్కడి నేతల్లో ఎనర్జీ రెట్టింపైంది. తనకి స్వాగతం పలికిన సహచర మంత్రులతో సరదాగా, కలివిడిగా గడిపారు నారా లోకేష్. ఇక మహానాడు వేదికపై తెలుగు కుటుంబం కాన్సెప్ట్‌ని, ప్రజలే దేవుళ్లు – సమాజమే దేవాలయం అన్న పార్టీ ప్రాథమిక సూత్రాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన 6 ఫార్ములాలని లోకేష్ ప్రజెంట్ చేసిని విధానం ఆకట్టుకుంది. “తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సూపర్ సిక్స్ ఫార్ములాతో పేదల కడుపు నింపుదాం, తెలుగువారిని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుదాం” అంటూ ప్రకటించారు నారా లోకేష్. తన ఆరు శాసనాలను ప్రతిపాదిస్తూ… ఇకపై పార్టీలో కార్యకర్తే అధినేత అని, కార్యకర్తల స్థాయి నుండి పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్ల స్థాయికి వారిని తీసుకురావాలని పిలుపిచ్చారు.
ఇక వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన తీర్మానం తొలిరోజు హైలెట్‌గా నిలిచింది. లోకేష్‌ను భవిష్యత్ నాయకుడిగా ప్రతిపాదించారు పల్లా శ్రీనివాసరావు. కార్యకర్తల ఆకాంక్ష కూడా ఇదేనన్నారు. చంద్రబాబుది అనుభవ నాయకత్వం అయితే.. లోకేష్‌ది నవ తరానికి కావాల్సిన యువ నాయకత్వం.. పార్టీ పగ్గాలు లోకేష్‌కు అప్పగించాల్సిన తరుణం.. అంటూ సూచించారు. 2019లో మంగళగిరిలో ఓటమి తర్వాత కూడా కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలిచిన లోకేష్… 2024లో 90 వేల ఓట్ల మెజారిటీతో పసుపు జెండా ఎగురవేసి, సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు పల్లా. మొత్తంగా… మహానాడు-2025 కడపలో టీడీపీ శక్తి ప్రదర్శనగా నిలిచింది. చంద్రబాబు, లోకేష్ ప్రసంగాలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపగా, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చి వేసే వేదికగా కడప మహానాడు చరిత్రలో నిలిపోతుందని అంటున్నారు పరిశీలకులు.