Mahanadu Committees: కడపలో మహానాడు అనగానే… తెలుగు తమ్ముళ్లలో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఎక్కడో ఒకింత కలవరపాటు. రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి శ్రేణులు మహానాడు పనుల్ని సజావుగా సాగనిస్తారా? కుట్రలు చేయరా? ఆటంకాలు సృష్టించరా? అలజడి రేకెత్తించే ఘటనలకు ప్రత్యర్థులు పాల్పడితే.. మహానాడుకు జనాలు ధైర్యంగా తరలి వస్తారా? అన్న సందేహాలు, సంశయాలు స్వయంగా టీడీపీ శ్రేణుల్లోనే వ్యక్తమయ్యాయన్నది వాస్తవం. కానీ ఎక్కడా, బాలారిష్టాలకు కూడా తావు లేకుండా.. కడప మహానాడు విజయవంతమైంది. అందుకు కావాల్సిన వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, నేతలతో కలిసి రూపొందించి, పక్కగా అమలు చేసి చూపించింది.
మూడు రోజులు. వేలాది మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు. ఇంత పెద్ద ఈవెంట్‌కి ఏర్పాట్లు పదే పది రోజుల్లో పూర్తయ్యాయంటే నమ్మగలరా? కానీ అధిష్టానం ఇచ్చిన టాస్క్‌ని టీడీపీ నేతలు వంద శాతం సక్సెస్ చేసి చూపించారు. మహానాడు నిర్వహణ బాధ్యతల్లో ఉమ్మడి కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ముఖ్యంగా పాలు పంచుకున్నారు. వీరితో పాటూ మరికొందరు నేతలకు కీలకంగా మహానాడు బాధ్యతలు అప్పజెప్పారు. వీరిలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, మారిటోరియం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్యలు ప్రముఖంగా ఉన్నారు.
ఇక మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సవితమ్మ, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిలు కీలకంగా పనిచేశారు. వీరితో పాటూ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు. వీరితో పాటూ ఇతర మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవిలకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఇక బీద రవిచంద్ర, సత్యనారాయణ రాజు, రాంగోపాల్ రెడ్డి, దామచర్ల సత్యలు 10 రోజులు ముందుగానే కడపకు చేరుకున్నారు. మహానాడు ఏర్పాట్లను తమ భుజాన వేసుకుని.. సభా వేదిక, సభా ప్రాంగణం, ప్రత్యేక గ్యాలరీలు, పార్కింగ్, ఇతర సదుపాయాల ఏర్పాట్లను ప్రత్యేక శద్ధ పెట్టి చూసుకున్నారు. వంట శాల, డైనింగ్, వసతి ఏర్పాట్లు… ఇలా అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించారు. ఇక అతిథులను అమితంగా ఆకట్టుకున్న అలంకరణకు సంబంధించి ఎమ్మెల్యే పులివర్తి నానితో కూడిన అలంకరణ కమిటీ సభ్యులు అదరగొట్టారు.
Also Read: Mahanadu Resolutions: ఎన్టీఆర్ సిద్ధాంతాలను లోకేష్ టచ్ చేశారా?
Mahanadu Committees: ఇక మహానాడుకు స్థానికంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా తెరవెనుక పరిస్థితులు చక్కబెట్టడంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, శ్రీనివాసరెడ్డి దంపతులు, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డిల కృషి గురించి చెప్పుకోవాలి. ఈ ముగ్గురూ అధినాయకత్వం తమకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. రెండు రాష్టాల నుండి తరలివచ్చిన పార్టీ నేతలకు, శ్రేణులకు, అభిమానులకు అపూర్వ ఆతిథ్యం, అతిథి సత్కారాలు అందించే బాధ్యతని తమ భుజస్కంధాలపై వేసుకుని అందర్నీ మెప్పించేలా పనిచేశారు. కడపలో అడుగుపెట్టిన ప్రతి కార్యకర్త.. పసుపుమయం అయిన కడపని చూసి పులకించిపోయాడు. మాధవిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, చైతన్యరెడ్డిల పనితీరు పట్ల లోకేష్, చంద్రబాబులు ప్రశంసలు కురిపించారు. ఇక కడప జిల్లా ఇంచార్జ్ మంత్రిగా సవితమ్మ సమన్వయం, సమర్థత.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పర్యవేక్షణ మెప్పించేలా ఉన్నాయి. మహానాడు ఏర్పాట్లపై నిత్యం టెలీకాన్ఫరెన్స్‌లు, పర్యవేక్షణ, సలహాలు, సూచనలు చేయడంలో పల్లా సఫలీకృతం అయ్యారు.