Mahanadu Resolutions: స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణే ధ్యేయంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడు వేదికగా 6 సూత్రాలను ఆవిష్కరించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. పార్టీకి మూల స్థంభమైన కార్యకర్తకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకతను లోకేష్ గుర్తించారు. కార్యకర్తే అధినేతగా తొలి శాసనం చేశారు. ఇకపై పార్టీ సంస్థాగత నిర్మాణంలో కార్యకర్తకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేఎస్ఎస్, క్యూబ్స్, మై టీడీపీ యాప్‌లతో ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇక రెండోది యువగళం. యువత సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ-వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, ప్రజా పాలనలో సాంకేతిక విజ్ఞానం, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా యువతను తీర్చిదిద్దడం యువగళం ఉద్దేశ్యం.
ఇక మూడో శాసనంగా తెలుగుజాతి – విశ్వఖ్యాతి అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. తెలుగు జాతి ఖ్యాతిని పెంచడంలో అన్న ఎన్టీఆర్ మేటిగా నిలిచారు. దాన్ని ముందుకు తీసుకెళ్తూ.. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతూ, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేయాలని సంకల్పించారు. ఇక మహిళా సంక్షేమం, సాధికారత, పటిష్టంగా శాంతిభద్రతలు… అనే అంశాలతో “స్త్రీ శక్తి”ని రూపొందించారు. పేదరికం లేని సమాజం, పీ4 సంకల్పం, అందరికీ అందుబాటులో విద్య, వైద్యం, స్వర్ణాంధ్ర విజన్@2047 దిశగా పేదల సేవలో – సోషల్ రీఇంజినీరింగ్ అనే శాసనాన్ని రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం, శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా అన్నదాతకు అండగా నిలవాలని సంకల్పించారు.
మరి ఈ ఆరు శాసనాలతో నారా లోకేష్ ఆశిస్తోందేంటి..! వాస్తవానికి పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఈ ఆరు శాసనాలను లోకేష్ ప్రతిపాదించలేదు. సిద్ధాంతాలను మరింత బలోపేతం చేసే దిశగానే ఆరు శాసనాలను ఆయన ప్రవచించారు. 43 సంవత్సరాల తెలుగు దేశం ప్రస్తానంలో ఇలా `శాసనాలు` చేయడం ఇదే తొలిసారి. తీర్మానాలు ప్రవేశపెట్టడం, చర్చించి ఆమోదించడం మాత్రమే ఉంది. కానీ ఆచరణలో ఖచ్చితంగా అమలవుతాయా లేదా అన్నది పరిస్థితులను బట్టే ఉంటుంది. అందుకే లోకేష్ తీర్మానాలుగా కాకుండా శాసనాలుగా వీటిని పేర్కొన్నారు. శాసనం అనే మాటలోనే ఖచ్చితంగా అమలు జరపాల్సిందే అన్న అర్థం ఉంది.
Also Read: Cm chandrababu: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Mahanadu Resolutions: ఇక పేదలకు సేవ, బీసీలకు ప్రాధాన్యం, మహిళల్ని అన్ని రంగాల్లో పైకి తీసుకురావడం, తెలుగు ప్రజల అభ్యున్నతి.. వంటి ముఖ్య సూత్రాలనే సిద్ధాంతాలుగా మార్చుకుంది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఎన్టీఆర్, చంద్రబాబులు ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు. ఇద్దరు కూడా.. తెలుగు ప్రజల సేవకే పార్టీని, తమ జీవితాన్ని అంకితం చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ.. తొలిసారి మూడోతరం నాయకుడిగా సాధ్యమైనంత త్వరలోనే పార్టీ పగ్గాలు చేపట్టనున్న నారా లోకేష్ ఇప్పుడు 6 శాసనాలను ప్రతిపాదించారు. అయితే పార్టీ సిద్ధాంతాలకు.. ప్రస్తుతం ప్రకటించిన ఆరు శాసనాలకు మధ్య పెద్ద తేడా లేదు. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను సంతరించుకునే దిశగానే లోకేష్ ఈ సూత్రాలను, శాసనాలను ప్రకటించారని చెప్పొచ్చు. మొత్తంగా.. ఈ శాసనాల ద్వారా పార్టీని నవతరానికి మరింత కనెక్ట్ చేయడం అనేది లక్ష్యంగా కనబడుతోంది.