Liquor Case Ed Entry: ఆంధ్రప్రదేశ్‌లో 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టడంతో పొలిటికల్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు కీలక నిందితులపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారిస్తూ ఆధారాల సేకరణలో ఈడీ నిమగ్నమైంది. ఈ కేసు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్‌లో 3,200 కోట్ల అవినీతి జరిగినట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ స్కామ్‌లో డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి కేసుకు రూ. 250 నుంచి రూ. 600 వరకు నెలవారీ లంచాలు వసూలు చేసినట్లు సిట్ తేల్చింది. ఈ నల్లధనం రాజ్ కసిరెడ్డి ద్వారా ఇతర నిందితులకు చేరినట్లు వెల్లడైంది. ఈ డబ్బును హవాలా నెట్‌వర్క్‌లు, షెల్ కంపెనీల ద్వారా మళ్లించి చట్టబద్ధమైన వైట్ మనీగా మార్చారని.. అంటే మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. సిట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ – ఈసీఐఆర్ నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ దర్యాప్తు కొనసాగుతోంది. రాజ్ కసిరెడ్డి, వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ఏపీ ఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ డి.వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి 33 మందిని నిందితులుగా ఈడీ పేర్కొంది.
జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన వ్యక్తి రాజ్ కసిరెడ్డి. అతనే ఈ స్కామ్‌లో ‘కింగ్‌పిన్’గా పేర్కొనబడ్డాడు. లిక్కర్ తయారీదారుల నుంచి నెలకు రూ. 60 కోట్ల వరకు లంచాలు వసూలు చేసినట్లు సిట్ తేల్చింది. ఈ నిధులను హవాలా నెట్‌వర్క్‌లు, షెల్ కంపెనీల ద్వారా లాండరింగ్ చేసి, రాజకీయ నాయకులకు, వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి ఐదు రోజులకొకసారి లిక్కర్ సేల్స్ డేటాను సేకరించి, లంచాలను లెక్కించి, మధ్యవర్తుల ద్వారా ఈ నిధులను బదిలీ చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఈడీ ఇప్పటికే విజయవాడ జైలులో రాజ్ కసిరెడ్డిని విచారిస్తోంది. అతడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఈడీ సిద్ధమవుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలోని షెల్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. అదాన్, లీలా, ఎస్పీవై వంటి డిస్టిలరీల లావాదేవీలను కూడా ఈడీ పరిశీలిస్తోంది.
Also Read: Kavitha: కవిత కోసమే క్యాబినెట్ విస్తరణ ఆగిందా?
Liquor Case Ed Entry: ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం జగన్ మోహన్ రెడ్డిని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది. సిట్ విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం, రాష్ట్ర ఆదాయంతో పాటు వైఎస్ఆర్‌సీపీకి నిధులు సమకూర్చేలా మద్యం పాలసీని రూపొందించాలని జగన్ ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం, నిందితులతో పాటు ఎవరినైనా విచారించే అధికారం ఈడీకి ఉంది. ఈ నేపథ్యంలో, జగన్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మరో ఆసక్తికర అంశం.. రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, ఒక వ్యక్తి అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించినట్లు ఈడీ నిరూపిస్తే, ఆ డబ్బు చట్టబద్ధమైనదని, తాము మనీ లాండరింగ్‌కు పాల్పడలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నిందితులపైనే ఉంటుంది. దీన్ని ‘రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్’ అంటారు. ఇది సాధారణ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ – సీఆర్‌పీసీకి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే సీఆర్‌పీసీలో నేరం జరిగిందని రుజువు చేసే బాధ్యత ప్రాసిక్యూషన్‌దే. కానీ పీఎంఎల్‌ఏ చట్టంలో ఆ భారం నిందితుల పైనే ఉంటుంది.
ఈ స్కామ్‌లో సేకరించిన నల్లధనాన్ని హవాలా నెట్‌వర్క్‌లు, షెల్ కంపెనీల ద్వారా లాండరింగ్ చేసినట్లు సిట్ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఈ నిధులు హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలోని షెల్ కంపెనీల ద్వారా బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 3,200 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చారు? బ్లాక్ మనీ ఎవరి ఖాతాల్లోకి ఎంతెంత వెళ్ళింది? బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి నిందితులు నగదుగా తీసుకున్న డబ్బును ఏం చేశారన్నది ఈడీ దర్యాప్తులో కీలక అంశం. ఈ నిధులు రాజకీయ అవసరాల కోసం వాడారా లేదా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించారా అన్నది ఈడీ పరిశీలిస్తోంది.
ఈడీ రంగంలోకి దిగడంతో ఏపీ లిక్కర్ కేసు రాజకీయంగా, న్యాయపరంగా కీలక దశకు చేరుకున్నట్లయింది. రాజ్ కసిరెడ్డి అరెస్ట్, షెల్ కంపెనీలపై దర్యాప్తు, జగన్‌పై విచారణ అవకాశం వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఈడీ తదుపరి చర్యలు, జగన్‌పై విచారణ నిర్ణయం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.