Kavitha Jagruthi CBN

Kavitha Jagruthi CBN: చంద్రబాబును ఆడిపోసుకోవడం మాత్రం కామన్‌!

Kavitha Jagruthi CBN: తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో గులాబీ నావ ఊగిసలాడుతోంది! గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ఒకే చర్చ.. గులాబీ కండువా కమలం రంగులోకి మారుతోందా అని. పార్టీ స్టీరింగ్ ఎవరి చేతిలోకి వెళ్తుందనే ప్రశ్న కనుమరుగై, ఇప్పుడు పార్టీ రెండు ముక్కలవుతుందా, మూడు ముక్కలవుతుందా అని క్యాడర్ లెక్కలు వేసుకుంటోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను ఆయుధంగా చేసుకొని అధికారం సాధించిన కేసీఆర్, ఆ సెంటిమెంట్‌ను రగిలించడానికి ఎప్పుడూ చంద్రబాబును బూచిగా చూపిస్తూనే వచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావుల నోట చంద్రబాబు పేరు మార్మోగుతూనే ఉంది. కానీ, ఇప్పుడు కల్వకుంట్ల కవిత సొంత సైన్యం.. తెలంగాణ జాగృతికి కూడా చంద్రబాబే లక్ష్యం అయ్యారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

గులాబీ క్యాడర్‌ అంతా కేసీఆర్‌ భజన చేస్తే.. కల్వకుంట్ల ఫ్యామిలీలో మాత్రం అందరూ చంద్రబాబు భజన చేస్తుంటారు. ఎందుకంటే బీఆర్‌ఎస్‌కు తెలంగాణ సెంటిమెంట్ ఊపిరిలాంటిది. అది లేకపోతే ఆ పార్టీ గడ్డిపోచే. అయితే ఈ సెంటిమెంట్‌ను రగిలించడానికి చంద్రబాబును బూచిగా చూపడం బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి ఓ అలవాటు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత.. బీఆర్‌ఎస్‌ నుండి వేరై.. సొంత వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీశ్‌రావులతో విభేదిస్తున్న కవిత.. ఒక్క విషయంలో మాత్రం వారితో ఏకీభవిస్తున్నారు. అదే ఏపీ సీఎం చంద్రబాబు ఆడిపోసుకోవడం.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సందర్భంగా, హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు కల్వకుంట్ల కవిత. అయితే, ఈ ధర్నాలో ట్విస్ట్ ఏంటంటే… చంద్రబాబు నాయుడే మళ్లీ లక్ష్యంగా మారటం! బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా చంద్రబాబు గోదావరి నీళ్లను దొంగిలిస్తున్నారని ఆరోపించారు కవిత. ఇప్పుడిప్పుడే పొలిటికల్‌ పార్టీగా రంగు మార్చుకుంటున్న కవిత మానస పుత్రిక “జాగృతి” సంస్థకు.. రాజకీయ ప్రాణ ప్రతిష్ట చేయడానికి కూడా చంద్రబాబే దిక్కయ్యారు కవితకు.

Also Read: Ys sharmila: డీఎస్సీ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలి

Kavitha Jagruthi CBN: అయితే చంద్రబాబుపై ఆరోపణలు జాగృతికి రాజకీయంగా ఎలాంటి మైలేజీ ఇవ్వవని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే, ఈ సెంటిమెంట్‌ని బీఆర్‌ఎస్‌ పేటెంట్‌ హక్కులా వాడేసింది. ఇప్పటికీ వాడుతూనే ఉంది. ఇక అసలు డ్రామా ఏంటంటే… కవిత ధర్నాకు బీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ హాజరు కాలేదు! కేవలం కవిత కోటరీ, జాగృతి సభ్యులు మాత్రమే అక్కడ కనిపించారు. బీఆర్‌ఎస్ హైకమాండ్ నుంచి “ధర్నాకు వెళ్లొద్దు” అని సంకేతాలు రావడంతో నాయకులు వెనక్కి తగ్గారని రాజకీయ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ఈ నిర్ణయంపై పార్టీలోని కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై కవిత ధర్నా చేస్తే, పార్టీ నాయకులు దూరంగా ఉండమని ఆదేశాలు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ గందరగోళంలో ఒక విషయం మాత్రం స్పష్టమైంది అంటున్నారు పరిశీలకులు. బీఆర్‌ఎస్ రెండు ముక్కలైనట్లే అని కవిత ధర్నా తేల్చేసింది అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *