APPSC Group 2 Final Results

APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ఎంపిక జాబితా విడుదల

APPSC Group 2 Final Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు అందింది. ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించిన గ్రూప్-2 నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం (జనవరి 27) రాత్రి కమిషన్ గ్రూప్-2 తుది ఎంపిక జాబితాను అధికారికంగా విడుదల చేసింది.

మొత్తం 905 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2023లో నోటిఫికేషన్ విడుదలవ్వగా, గత మూడేళ్లుగా ఈ ప్రక్రియ రకరకాల కారణాలతో సాగుతూ వచ్చింది. కోర్టు కేసులు, సాంకేతిక సమస్యల వల్ల మెయిన్స్ పరీక్షల తర్వాత నియామకాలు నిలిచిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను వేగవంతం చేసి, అభ్యర్థుల నిరీక్షణకు తెరదించింది.

ఇది కూడా చదవండి: Kishan Reddy: మెస్సీ కార్యక్రమంపై రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

ఫలితాల ముఖ్యాంశాలు: ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో మొత్తం 891 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఇందులో కొన్ని కీలక అంశాలను కమిషన్ స్పష్టం చేసింది:

  • కోర్టు ఆదేశాలు: హైకోర్టు తీర్పును అనుసరించి ఎక్సైజ్ ఎస్సై, లా ఏఎస్‌ఓ పోస్టులను అభ్యర్థుల ఐచ్చికాల ప్రకారం ఎంపిక చేశారు.
  • రిజర్వ్ చేసిన పోస్టులు: క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులను పక్కన పెట్టారు.
  • మార్పులు ఉండే అవకాశం: ఎంపికైన వారిలో 866 పోస్టుల్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే 25 పోస్టులకు సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ల ప్రకారం చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.
  • మిగిలిన పోస్టులు: అభ్యర్థులు లేని కారణంగా దివ్యాంగ కోటాలోని 7 పోస్టులు, మరో 5 రిజర్వేషన్ పోస్టులను భర్తీ చేయలేదు.

ప్రయాణం సాగిందిలా: 2023 డిసెంబర్‌లో 905 పోస్టుల భర్తీకి ప్రకటన రాగా, 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఆ తర్వాత 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ నిర్వహించి, అదే ఏడాది ఏప్రిల్‌లో ఫలితాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా వివాదం వల్ల తుది జాబితా ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు ఫలితాలు రావడంతో ఎంపికైన అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *