AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. 2026 ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపు, అంటే ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది.
విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవడానికి విద్యాశాఖ పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, సాంకేతికతను జోడించి ఈసారి మరింత వేగంగా రిజల్ట్స్ చూసుకునే వెసులుబాటు కల్పించారు. ‘మన మిత్ర’ వాట్సాప్ సర్వీస్ ద్వారా 9552300009 నంబర్‌కు కేవలం “Hi” అని మెసేజ్ పంపి ఫలితాలు పొందవచ్చు. అలాగే ‘LEAP’ మొబైల్ యాప్, డిజిలాకర్ (DigiLocker) యాప్ మరియు వెబ్సైట్ ద్వారా కూడా విద్యార్థులు తమ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు.
స్కూల్ లాగిన్ల ద్వారా కూడా ఫలితాలను వేగంగా పొందే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన వెంటనే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ ఐడీల ద్వారా రిజల్ట్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. దీనివల్ల ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులు తమ పాఠశాలలకు వెళ్లి నేరుగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోయినా విద్యార్థులు ఎవరూ నిరుత్సాహపడకూడదని ఆయన సూచించారు. పదో తరగతి ఫలితాలు అనేవి జీవిత ప్రయాణంలో ఒక చిన్న మైలురాయి మాత్రమేనని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు వస్తాయని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.
