Ashu Reddy: టాలీవుడ్ నటి అషురెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందనే ఆరోపణలతో ఇప్పటికే ఆమెపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అషురెడ్డి పేరుతో ఉన్న ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాధితుడితో ఆమె జరిపినట్లుగా చెబుతున్న ఈ సంభాషణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వైరల్ అవుతున్న ఆ ఆడియోలో.. వెంకీ (ధర్మేంద్ర), నువ్వు మావాళ్లకు ఫోన్ చేస్తున్నావని తెలిసింది. నీకు మళ్లీ చెబుతున్నాను, నాకు మే నెల వరకు సమయం ఇస్తే నీకు ఒక కోటిన్నర రూపాయలు బ్యాంకు ద్వారా తిరిగి ఇచ్చేస్తాను. మిగిలిన డబ్బును నేను సెటిల్ అయ్యాక ఇస్తాను” అని ఆ వాయిస్ వినిపిస్తోంది. అంతేకాకుండా, తన కుటుంబ సభ్యులను ఈ విషయంలోకి లాగవద్దని, ఒకవేళ వినకపోతే వేధింపుల కేసు పెడతానని హెచ్చరించినట్లు కూడా ఆ రికార్డింగ్‌లో ఉంది. ఈ పంచాయతీలో వేణుస్వామి, ప్రవీణ అనే వ్యక్తులు మధ్యవర్తులుగా ఉంటారని ఆ వాయిస్ పేర్కొనడం గమనార్హం.
మరోవైపు, ఈ కేసులో బాధితుడైన ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఇప్పటికే పోలీసులకు కీలక ఆధారాలు అందజేశారు. 2018 నుంచి అషురెడ్డి తన కుమారుడి దగ్గర దాదాపు రూ. 9.35 కోట్లు తీసుకుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి బ్యాంకు లావాదేవీల రశీదులను కూడా బయటపెట్టారు. అయితే తనపై జరుగుతున్న ప్రచారం తప్పని, ఎవరైనా అసత్యాలు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని అషురెడ్డి ఇదివరకే సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.
ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. వైరల్ అవుతున్న ఆడియో నిజంగా అషురెడ్డిదేనా కాదా అని నిర్ధారించడానికి దానిని ఫోరెన్సిక్ లాబ్‌కు పంపించారు. బ్యాంకు స్టేట్‌మెంట్లను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని బుధవారం అషురెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
