Chandrababu Naidu

Chandrababu Naidu: కార్యకర్తలే పార్టీ బలం.. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ ఆత్మగౌరవంతో ఉంటారని, ఎవరికీ తలవంచరని కొనియాడారు. “కార్యకర్తే అధినేత” అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, ఈసారి కమిటీల ఎంపికలో కష్టపడిన వారికి, సాధారణ స్థాయి నేతలకు కూడా పెద్దపీట వేశామని ఆయన గర్వంగా ప్రకటించారు.

పార్టీ చరిత్రలో మొదటిసారిగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఒక మండల అధ్యక్షురాలికి మరియు క్లస్టర్ ఇన్‌చార్జికి అత్యున్నతమైన ‘పొలిట్‌బ్యూరో’లో స్థానం కల్పించడం విశేషం. మహిళలకు, చదువుకున్న యువతకు ఈ కొత్త కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చామని చంద్రబాబు తెలిపారు. రామ్మోహన్ నాయుడు, శబరి వంటి యువ నాయకులను జాతీయ స్థాయి పదవుల్లో నియమించామని చెప్పారు. నారా లోకేశ్ గురించి మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కార్యకర్తల కోసం పడిన కష్టం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో చూపిస్తున్న చొరవ అమోఘమని, అందుకే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ‘బాధ్యత’ను అప్పగించామని వివరించారు.

రాష్ట్ర అభివృద్ధిపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని చెప్పారు. నిలిచిపోయిన పథకాలను పునరుద్ధరించడమే కాకుండా, ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నాన్ని గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ వంటి సంస్థల ద్వారా టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతామని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని భరోసా ఇచ్చారు.

చివరగా, ప్రత్యర్థి పార్టీలపై చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసిన వారు, ఇప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను గందరగోళానికి గురిచేయాలని చూస్తున్నారని, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని, 2024 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *