Ap News: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకం కింద రావాల్సిన డబ్బులు రాలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి నిరసనకు దిగాడు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను కలిగించింది.
భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన కోరుపల్లి శ్యామ్ అనే వ్యక్తి, తన పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రావాల్సిన డబ్బులు తన ఖాతాలో జమ కాలేదని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఆవేశానికి గురైన అతను సమీపంలోని సెల్ టవర్‌పై ఎక్కాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు అక్కడికి పరుగెత్తారు. టవర్‌పై ఉన్న తండ్రిని చూసి అతని చిన్న కూతురు కన్నీటి పర్యంతమై “కిందకి దిగు డాడీ!” అంటూ ఏడవడం అందరినీ కలచివేసింది.
అయితే, శ్యామ్ భార్యతో పాటు కుటుంబ సభ్యులు డబ్బులు ఖాతాలోకి వచ్చాయని చెప్పినా అతను నమ్మకపోయాడు. అధికారులు రాతపూర్వక హామీ ఇస్తేనే దిగుతానని పట్టుబట్టాడు.
దీంతో పోలీసులు జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని నచ్చజెప్పారు. అప్పుడు శ్యామ్ కాస్త శాంతించి, చివరికి టవర్ నుంచి కిందకు దిగాడు. దీనితో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.