Ration Card: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కళ్లముందు ఉంచుకున్న కూటమి ప్రభుత్వం… రేషన్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. పేదలకు ఉపయోగపడే విధంగా, గత ప్రభుత్వ వైఫల్యాలను సవరిస్తూ నూతన విధానాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, రేషన్ బియ్యం తీసుకోవడానికి ఇష్టపడని లబ్ధిదారులకు నగదు లేదా చిరుధాన్యాలు ఇచ్చే ప్రతిపాదనపై ప్రభుత్వం సీరియస్ గా లోచిస్తోంది.
మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని రాజపేట గ్రామంలో చౌకధరల దుకాణాన్ని సందర్శించి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… గత వైసీపీ హయాంలో రేషన్ వ్యవస్థలో జరిగిన అవకతవకలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇంటింటి రేషన్ పేరిట బియ్యం మాఫియా చేతిలో పడిపోయింది. వేల కోట్లు దోచుకుపోయారు. పేదల అభివృద్ధికి కచ్చితంగా ఇది ఆటంకమైంది అంటూ ఆరోపించారు.
పారదర్శకతకు పెద్దపీట – ప్రజల అభిప్రాయమే ప్రాముఖ్యం
కొత్త విధానంలో భాగంగా.. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ముందస్తుగా తేది పేర్కొనడంతో ప్రజలకు అవసరమైన సమయంలో రేషన్ పొందేందుకు తగిన గడువు లభిస్తుందని వివరించారు.
ఇది కూడా చదవండి: Chandrababu-Pawan Kalyan: తెలంగాణ అవతరణ దినోత్సవం.. విషెస్ చెప్పిన చంద్రబాబు, పవన్
ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని.. బియ్యం బదులుగా నగదు, రాగులు, సజ్జలు, ఇతర చిరుధాన్యాలను ఇవ్వాలన్న ఆలోచనపై ప్రభుత్వం దృష్టి సారించింది అని అన్నారు. ప్రతి కుటుంబం అవసరం వేరు. ఎవరికైనా బియ్యం అవసరం లేకపోతే ఇతర ఎంపికలు ఇవ్వాలని భావిస్తున్నాం అని మంత్రి వెల్లడించారు. ఈ మార్పు ప్రజల ఆహార అలవాట్లలో సానుకూల మార్పును తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు.
డిజిటల్ మానిటరింగ్ – మాఫియాకు తలుపులు మూసే చర్యలు
కొత్త విధానంలో రేషన్ పంపిణీని పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బయోమెట్రిక్ ధ్రువీకరణ, డిజిటల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మాఫియా, అక్రమ లావాదేవీలకు చోటు లేకుండా చూడనుంది.
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ఈ నిర్ణయం ద్వారా లబ్ధిదారులకు నేరుగా లాభం చేకూరే అవకాశముంది. ప్రజల అవసరాల ఆధారంగా ఎంపికలు ఇచ్చే ఈ విధానం, ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది. రేషన్ వ్యవస్థలో ఈ సరికొత్త మార్పులు పేదల జీవన ప్రమాణాల్లో స్థిరమైన అభివృద్ధికి దోహదపడతాయని నిపుణుల అభిప్రాయం.