Rajya Sabha: దేశ రాజధాని రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరడానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధికారికంగా ఆమోదముద్ర వేశారు. దీంతో రాఘవ్ చద్దా, హర్బజన్ సింగ్ వంటి కీలక నేతలతో సహా మొత్తం ఏడుగురు ఎంపీలు ఇకపై అధికారికంగా బీజేపీ సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ మార్పుకు సంబంధించి రాజ్యసభ సెక్రటేరియట్ ఇప్పటికే అధికారిక బులెటిన్‌ను విడుదల చేసింది.
బలపడిన బీజేపీ.. కుదేలైన ఆప్:
ఈ చేరికలతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు 106 మంది సభ్యులతో ఉన్న బీజేపీ బలం ఇప్పుడు 113కు చేరుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనకరం, ఎందుకంటే రాజ్యసభలో కీలక బిల్లులను ఆమోదించుకోవడం ఇకపై మరింత సులభం కానుంది. మరోవైపు, రాజ్యసభలో పది మంది ఎంపీలతో పటిష్టంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ బలం ఇప్పుడు కేవలం 3కు పడిపోయింది. ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
షాక్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ:
గత శుక్రవారం జరిగిన ఈ పరిణామం ఆప్ అధినాయకత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ వంటి ముఖ్య నేతలు స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి స్వీట్లు తినిపించి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే, తమ ఎంపీలు పార్టీ మారడంపై ఆప్ నేత సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఫిరాయింపులు చట్టవిరుద్ధమని, పార్టీ మారిన ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ యుద్ధం.. తీవ్ర విమర్శలు:
ఈ పరిణామం అటు ఢిల్లీ, ఇటు పంజాబ్ రాజకీయాల్లో మంటలు రేపింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మాజీ సహచరులపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా రాఘవ్ చద్దాను “ద్రోహి” అని సంబోధిస్తూ, వీరంతా పంజాబ్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలకు వ్యతిరేకంగా “పంజాబ్ ద్రోహులు” అంటూ పోస్టర్లు వెలిశాయి. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఈ చేరికలు చెల్లుతాయా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
