Mulugu: తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరిస్తున్న గ్రామాల్లో మరొకటి చేరింది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో మూడు గ్రామాలు సర్వేను బహిష్కరిస్తున్నట్టు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదించాయి. అదే కోవలో మరో ఆదివాసీ గ్రామం కూడా తమ ఊరి సమస్యలను ఏకరువు పెడుతూ సోమవారం ఏకంగా బహిష్కరణకు నిర్ణయించింది.
Mulugu: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఆదివాసీ గ్రామమైన ఐలాపూర్‌కు గత కొన్నేండ్లుగా రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పొలాల్లో బోర్లు వేసి సుమారు ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు విద్యుత్తు లైన్లు వేయలేదు. ఐలాపూర్ గ్రామానికి ఏటూరు నాగారానికి మధ్యలో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 2018లో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయినా అటవీశాఖ అనుమతులు లేవంటూ పనులను నిలిపేశారు.
Mulugu: తమ గ్రామానికి రోడ్డు, విద్యుత్తు, తాగు, సాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఐలాపూర్ గ్రామస్థులు ఏకమయ్యారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ సమగ్ర కులగణన సర్వేను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అక్కడికి వచ్చిన అధికారులకు తమ ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు.