Amaravati

Amaravati: నేడు అమరావతిలో రెండో దశ ల్యాండ్‌ పూలింగ్‌.!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం రెండో దశ భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించడమే ఈ దశ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.

రెండో దశలో భాగంగా తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల్లో సుమారు 16,666 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించనుంది. ఇందులో భాగంగా వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి, వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతుల నుంచి అంగీకార పత్రాలను స్వీకరిస్తున్నారు. వడ్డమానులో ఉదయం ప్రారంభమైన ఈ ప్రక్రియ, సాయంత్రం ఎండ్రాయి గ్రామంలో నిర్వహించనున్న గ్రామసభతో కొనసాగనుంది. అధికారులు గ్రామాలకు స్వయంగా వెళ్లి భూ సమీకరణ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, వారిలో అవగాహన కల్పిస్తున్నారు.

Also Read: Tamilnadu: త‌మిళ‌నాడులో అమిత్‌షా పాచిక పారేనా?  ఎన్డీయే కూట‌మిలో విజ‌య్ పార్టీ చేరేనా?

ఈ సందర్భంగా జరిగిన సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ లబ్ధిదారుల్లో ఏడుగురు తల్లిదండ్రులు లేని మైనర్లు ఉండగా, వారికి కూడా పెన్షన్ మంజూరు చేసేందుకు అనుమతినిచ్చారు. అలాగే, గతంలో కేటాయించిన ప్లాట్లలో వాస్తు దోషాలు (వీధి శూల) ఉన్న 112 కమర్షియల్ ప్లాట్ల స్థానంలో కొత్త ప్లాట్లను మార్చుకునే వెసులుబాటును కల్పించారు. అయితే, ఇప్పటికే ప్లాట్లను ఇతరులకు విక్రయించిన వారికి ఈ అవకాశం వర్తించదని స్పష్టం చేశారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా కృష్ణా రివర్ ఫ్రంట్ మెరైనా కోసం ఒక ఎకరం భూమిని కేటాయించాలని నిర్ణయించారు.

రైతులకు కేటాయించే లేఅవుట్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈసారి ముందుగా రెండు వరుసల రహదారులు, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అప్పగించాలని అధికారులు నిశ్చయించారు. సీఆర్డీఏ కార్యకలాపాల కోసం 2015లో మంజూరైన 754 పోస్టుల భర్తీకి కూడా అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణంలో రైతులు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *