Amaravati: ఏపీలోని 120 గ్రామాలకు 4g సేవలు

Amaravati: రాష్ట్రంలో ఇప్పటివరకు మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం లేని గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో డిజిటల్ ఇండియా ఫండ్ పరిధిలో 4జీ సేవలను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది.

ఈ నిర్ణయం మేరకు తొలి దశలో అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, పల్నాడు, నెల్లూరు, సత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లోని నెట్‌వర్క్ లేని గ్రామాలకు మొబైల్ సేవలను విస్తరించనున్నారు. దీంతో ఆ ప్రాంతాల ప్రజలకు కమ్యూనికేషన్, ఆన్‌లైన్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

ఈ ప్రాజెక్టు అమలుకోసం టెలికాం శాఖ సుమారు రూ.120 కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

అలాగే, ఆయా గ్రామాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు పనులను ఒక ఏడాది లోపే పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం గ్రామీణ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *