AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమాపై గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. వీరిద్దరి ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులకు చెక్ పెడుతూ.. లోకేశ్ కనగరాజ్ స్వయంగా అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఈ ఫొటోతో పాటు.. “త్వరలోనే ఆసక్తికరమైన అప్డేట్స్ రానున్నాయి” అంటూ లోకేశ్ క్యాప్షన్ ఇవ్వడంతో, ఈ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా కాంబో పట్టాలెక్కడం ఖాయమని స్పష్టమైంది.
కథ నచ్చలేదంటూ ప్రచారం – క్లారిటీ ఇచ్చిన టీమ్..
గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో ఈ సినిమాపై రకరకాల రూమర్లు షికారు చేశాయి. లోకేశ్ చెప్పిన స్క్రిప్ట్ పట్ల బన్నీ పూర్తి సంతృప్తిగా లేరని, అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం వేచి చూస్తున్న అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
బన్నీ టీమ్ ఖండన..
ఈ ప్రచారంపై అల్లు అర్జున్ టీమ్ ఇప్పటికే స్పందించి, సినిమా రద్దు కాలేదని, చర్చలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు స్వయంగా లోకేశ్ రంగంలోకి దిగి ఫొటోను షేర్ చేయడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించే కాంబో..
‘పుష్ప 2: ది రూల్’ భారీ విజయంతో గ్లోబల్ స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. అటు తనకంటూ ప్రత్యేక సినిమాటిక్ యూనివర్స్ (LCU), ఇంటెన్స్ యాక్షన్ కథలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ కలవడం సినీ ప్రియుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
త్వరలోనే అధికారిక ప్రకటన..
ఈ ప్రాజెక్ట్ కథాంశం, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం ఇంకా గోప్యంగానే ఉంచింది. అయితే లోకేశ్ ఇచ్చిన హింట్‌తో అతి త్వరలోనే ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ వెలువడనుందని తెలుస్తోంది.
