Bachhala Malli Teaser: ‘అల్లరి’ నరేశ్ ఈ మధ్య ట్రాక్ మార్చాడు. వినోదాత్మక చిత్రాలతో పాటు విషయమున్న సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అలా వచ్చిన ‘గమ్యం, నాంది’ లానే తన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని అంటున్నాడు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్ లో చిత్రబృందం సమక్షంలో జరిగింది. ‘బచ్చల మల్లి’ చిత్రాన్ని సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. మాస్ లుక్ తో నరేశ్ ఆకట్టుకుంటున్నాడు. అలానే డెప్త్ ఉన్న క్యారెక్టర్ అతనిదని టీజర్ ద్వారా అర్థమౌతోంది. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా, హీరో తల్లి పాత్రను రోహిణి చేసింది. రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ఇతర కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే రెండు విడుదలయ్యాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకుగా డిసెంబర్ 20న రాబోతోంది.